హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): అగ్నిమాపకశాఖలోని డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు కనీసం రెండేండ్ల క్రితమే హెవీ మోటర్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. అగ్నిమాపక శాఖలో 225 డ్రైవర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి(టీఎస్ఎల్పీఆర్బీ) ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. డ్రైవర్ పోస్టుల భర్తీలో అభ్యర్థులకు ప్రాథమిక రాతపరీక్ష ఉండదని, పురుషులు మాత్రమే ఈ పోస్టుకు అర్హులని టీఎస్ఎల్పీఆర్బీ పేర్కొన్నది. అగ్నిమాపకశాఖలో డ్రైవింగ్ పోస్ట్ అత్యంత కీలకం కాబట్టి హెవీ మోటర్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి అనే నిబంధన పెట్టినట్టు అధికారులు తెలిపారు. యూనిఫాం సర్వీస్ ఉద్యోగాలన్నింటికీ ప్రభుత్వం ఐదేండ్లు వయోపరిమితి పెంచినందున 30 ఏండ్ల లోపు అభ్యర్థులు అర్హులు. వివిధ రిజర్వేషన్ల క్యాటగిరీలకు మరో ఐదేండ్లు వెసులుబాటు ఉంటుంది. ఫిజికల్ టెస్ట్‌లకు సంబంధించిన తేదీలు, నిర్వహించే ప్రాంతం తదితర వివరాలను ఇంటిమేషన్ లెటర్ల ద్వారా అభ్యర్థులకు తెలియజేస్తారు. అభ్యర్థులు ‘www.tslprb.in’వెబ్సైట్ ద్వారా ఇంటిమేషన్ లెటర్లు పొందవచ్చని అధికారులు తెలిపారు. తేదీలు ఖరారైన తర్వాత వివరాలను వెబ్సైట్లో పొందుపరుస్తారు.