Himayat Sagar | హైదరాబాద్ సిటీబ్యూరో/మణికొండ, అక్టోబరు 29 (నమస్తే తెలంగాణ ): స్వచ్ఛమైన మంచినీటికి ఆలవాలమైన హిమాయత్‌సాగర్ రిజర్వాయర్ ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల తేడా లేకుండా సంపన్న వర్గాలు ఎకరాల కొద్దీ కబ్జా చేసి విలాసవంతమైన నిర్మాణాలు చేపట్టారు. వాస్తవానికి ఈ ఆక్రమణలు, ఫాంహౌస్ సంస్కృతి అనేది దాదాపు నాలుగైదు దశాబ్దాల క్రితమే మొదలైంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో విచ్చలవిడిగా ఈ రిజర్వాయర్ పరిధిలో నిర్మాణాలు జరిగాయనేది జగమెరిగిన సత్యం. కాంగ్రెస్ నేతలకే ఎక్కువ సంఖ్యలో ఇక్కడ ఫాంహౌస్‌లు ఉన్నాయనేది కూడా ప్రతి ఒక్కరికీ తెలిసిందే. కానీ, తాజాగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాత్రికి రాత్రి ఈ ఫాంహౌస్‌లు వెలసినట్టుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రతి సమావేశంలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించి ‘కూలగొడదామా?’ అని సవాళ్లు విసిరిన సందర్భాలు అనేకం. ఈ నేపథ్యంలో హిమాయత్‌సాగర్ రిజర్వాయర్ ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో గత నెల మొదటి వారంలో హిమాయత్‌సాగర్, అజీజ్‌నగర్, నాగిరెడ్డిగూడ, బాకారం, నర్కుడ, కొత్వాల్‌గూడ ప్రాంతాలలో జలమండలి అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు. ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో సరిహద్దు రాళ్లు ఎక్కడ ఉన్నాయి? వాస్తవికంగా హద్దులు ఎక్కడిదాకా ఉన్నాయి? వాటి పరిధుల్లో ఎన్ని నిర్మాణాలు ఉన్నాయి? అవి ఎవరివి? అనే వివరాలతో నివేదిక రూపొందించారు.
నెల దాటినా చర్యలేవి?
జలమండలి అధికారుల నివేదిక ప్రకారం హిమాయత్‌సాగర్ ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో 83 అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు నివేదికలో పొందుపరిచారు. ఈ నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమర్పించారు. అంటే సీఎం చైర్మన్‌గా ఉన్న హైడ్రాకు కూడా ఈ నివేదిక వెళ్లిందనేది సుస్పష్టం. విచిత్రమేమిటంటే, ఈ నివేదిక ప్రభుత్వానికి చేరిన తర్వాత కూడా రేవంత్‌రెడ్డి పలు సందర్భాల్లో బీఆర్ఎస్ నేతల ఫాంహౌస్‌లు ఉన్నాయని ఆరోపిస్తూ ‘కూల్చుదామా’ అని సవాళ్లు విసిరారు. అక్రమ నిర్మాణాలు ఉన్న వారు సైతం తమవి అక్రమమైతే తామే కూల్చుకుంటామని కూడా ప్రకటించుకున్నారు. కానీ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. గండిపేట పరిధిలో ఆగస్టు 18న నిర్మాణాలు కూల్చడం మినహా ఆ తర్వాత హైడ్రా అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు.
జగమెరిగిన నిర్మాణాలు నివేదికలో మాయం
జలమండలిశాఖ నిర్వహించిన ఎఫ్టీఎల్, బఫర్జోన్ల సర్వేలో పలువురు ప్రముఖుల నిర్మాణాలను ఉద్దేశపూర్వకంగా తప్పించినట్టు తెలిసింది. ముఖ్యంగా మాజీ మంత్రి, తాజా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి ఫాంహౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉందనేది సదరు నిర్మాణాన్ని చూసిన ప్రతి ఒక్కరికీ అర్థమువుతుంది. కానీ, అధికారులు ఉద్దేశపూర్వకంగా ఆ నిర్మాణాన్ని ఎఫ్టీఎల్లో కానీ, బఫర్‌జోన్‌లో కానీ ఉన్నట్టు పేర్కొనలేదు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఆయన సోదరుడి గృహాలు కూడా బఫర్‌జోన్‌లో ఉన్నాయని స్పష్టంగా తెలుస్తున్నది. అయినప్పటికీ అధికారులు అటువైపు నిర్మాణాలను వదిలివేయడం పలు అనుమానాలకు తావిస్తున్నది. జలమండలి అధికారులు కేవలం ఎఫ్టీఎల్, 30 మీటర్ల బఫర్‌జోన్‌ను మాత్రమే పరిగణలోనికి తీసుకోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జంట జలాశయాల ఎఫ్టీఎల్ నుంచి 500 మీటర్ల వరకు అంటే అర కిలోమీటరు వరకు ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టవద్దని స్పష్టమైన పురపాలక శాఖ ఆదేశాలు ఉన్నాయి. అయినా జలమండలి అధికారులు తమ సర్వేలో ఈ ఆదేశాలను పరిగణలోనికి తీసుకోలేదు.
– హిమాయత్‌సాగర్ చెంతన తన ఫాంహౌస్‌పై మాజీ ఎంపీ, తాజా కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఇచ్చిన వివరణ ఇది.
నాగిరెడ్డిగూడ పరిధిలోని హిమాయత్‌సాగర్ జలాశయం ఎఫ్టీఎల్లో శాశ్వత నిర్మాణాలు.. అంటే జీ-1 వంటి భవనాలు ఉన్నాయనేది జలమండలి అధికారుల సర్వే నివేదికలో పొందుపరిచిన వాస్తవం.
-సీఎం రేవంత్‌రెడ్డికి ఇటీవల రాసిన లేఖలో కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ స్పష్టీకరణ హిమాయత్‌సాగర్ పరిధిలోని కేవీపీ (కే ఉజ్వల్) ఫాంహౌస్ ప్రహరీ బఫర్‌జోన్ పరిధిలోకి వస్తుందనేది జలమండలి అధికారుల సర్వే తేల్చిన నిజం.
అజీజ్‌నగర్‌లో శ్రీనిధి స్కూల్ యజమాని కేటీ మహికి (మంత్రి వియ్యంకుడు అయిన ప్రస్తుత కాంగ్రెస్ ఎంపీ భాగస్వామ్యం ఇందులో ఉంది) చెందిన ఒక చిన్న భవనం, కార్మికుల గుడిసెలు, ఆయన నివాస ప్రాంగణంలోని గోల్ఫ్ కోర్ట్, బంకర్, ప్రహరీ, మరికొన్ని చిన్న నిర్మాణాలు, క్రికెట్ గ్రౌండ్ ప్రహరీ ఇవన్నీ ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తాయని సర్వేలో తేల్చారు.