Telangana | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఉచిత విద్యుత్‌తో రైతులు పంటలు పండించుకుంటున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాష్ట్రంలో అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదు అయింది.
శుక్రవారం ఉదయం 11:01 అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైనట్లు ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు పేర్కొన్నారు. విద్యుత్ డిమాండ్ వేసవి కాలాన్ని అధిగమించినట్లు తెలిపారు. ఇవాళ రాష్ట్రంలో 14,136 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడినట్లు చెప్పారు. రాష్ట్రం ఏర్పడ్డాక వానాకాలంలో అత్యధిక విద్యుత్ వినియోగం నమోదు కావడం ఇదే తొలిసారి. వర్షాభావ పరిస్థితులు, వరిసాగు విస్తీర్ణం పెరగడంతో భారీగా విద్యుత్ డిమాండ్ పెరిగినట్లు పేర్కొన్నారు. గతేడాది ఇదే రోజు 12,251 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. ఎంత డిమాండ్ ఉన్నా సాగు, వినియోగదారులకు విద్యుత్ ఇస్తామని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ స్పష్టం చేశారు.