హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : బీటెక్ మేనేజ్మెంట్ కోటా(బీ- క్యాటగిరీ) సీట్ల భర్తీలో పలు కాలేజీలు నిబంధనలకు నీళ్లు వదిలినట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి గుర్తించింది. తమకు ఇష్టం వచ్చినట్టు సీట్లను భర్తీచేసిన 18 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలకు షోకాజ్ నోటీసులిచ్చి వివరణ కోరింది. సంబంధిత కాలేజీల సీట్ల ర్యాటిఫికేషన్(ఆమోదాన్ని) పెండింగ్ పెట్టింది. కాలేజీలు లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చేవరకూ ఇది కొనసాగనున్నది. నోటీసులందుకున్న కాలేజీల్లో అన్ని ప్రముఖ కాలేజీలే ఉండటం గమనార్హం. బీటెక్‌లో 30 శాతం సీట్లను మేనేజ్మెంట్ కోటాలో భర్తీచేసుకునే అవకాశమున్నది. 15 శాతం సీట్లను ఎన్నారై కోటాలో భర్తీచేసుకోవాలి. ఈ సీట్లను జేఈఈ మెయిన్స్ ర్యాంకుల ఆధారంగా భర్తీచేయాలి. ఆ తర్వాత మిగిలిన సీట్లను ఎప్‌సెట్ ర్యాంక్, ఇంటర్ మెరిట్ ఆధారంగా నింపుకోవచ్చు. ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతే కాలేజీలు ఆయా సీట్లను భర్తీచేసుకోవాలి. కానీ, కొన్ని కాలేజీలు నోటిఫికేషన్‌కు ముందే నిర్దేశిత ఫీజు కంటే ఎక్కువ ఫీజుకు సీట్లను నింపేసుకున్నాయి. దీంతో ఆయా కాలేజీలపై ఉన్నత విద్యామండలి కన్నెర్రచేసింది.
బీ-క్యాటగిరీ సీట్ల భర్తీలో జరిగిన అక్రమాలపై ఉన్నత విద్యామండలికి అనేక ఫిర్యాదులు వచ్చాయి. ముఖ్యంగా వీఎన్నార్ విజ్ఞానజ్యోతి, సీబీఐటీ, నారాయణమ్మ, గోకరాజు రంగరాజు, బీవీఆర్ఐటీ, సీవీఆర్ వంటి కాలేజీలపై మండలికి ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యామండలి నోటీసులు జారీచేసింది. బీ-క్యాటగిరీ సీట్ల ర్యాటిఫికేషన్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. రోజుకు 20 చొప్పున కాలేజీలు సమర్పించిన వివరాలను పరిశీలించేందుకు మండలి అధికారులు కమిటీని నియమించారు.