వరంగల్/వికారాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కుంటాల: అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్‌తోపాటు డోలు హన్మంతును పోలీసులు అరెస్టు చేశారు. కొడంగల్ మున్సిఫ్ కోర్టు మేజిస్ట్రేట్ ఎదుట వీరిని హాజరుపర్చగా, 16 రోజులపాటు రిమాండ్ విధించారు. ఇద్దరు నిందితులను వికారాబాద్ జిల్లా పరిగి సబ్ జైలుకు పోలీసులు తరలించారు. ఈ నెల 19న కొడంగల్ మండలం రావులపల్లిలో జరిగిన ఓ సమావేశంలో బైరి నరేశ్, డోలు హన్మంతు అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను కొడంగల్ పోలీస్‌స్టేషన్‌లో ఐపీసీ-153 (ఏ), 295 (ఏ), 505 (2) సెక్షన్ల కింద కేసు నమోదైంది. శుక్రవారం నుంచి రెండు ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు చేపట్టి శనివారం వరంగల్‌లో అదుపులోకి వీరిని తీసుకున్నారు. వరంగల్ నుంచి నేరుగా కొడంగల్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు, అనంతరం మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. రిమాండ్‌కు తరలిస్తున్న సమయంలో పరిగి సబ్ జైలు వద్దకు అధికసంఖ్యలో అయ్యప్ప స్వాములు చేరుకొన్నారు.
లోపలికి చొచ్చుకొని పోయేందుకు ప్రయత్నించారు. నరేశ్‌పై పీడీ యాక్ట్ పెట్టాలని, అతడితో క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు. అయ్యప్ప భక్తుల నుంచి తనను తాను కాపాడుకునేందుకు పోలీసు వాహనం దిగిన నరేశ్ భయంతో జైల్లోకి పరుగులు పెట్టాడు. పరిగి డీఎస్పీ కరుణసాగర్‌రెడ్డి, ఎస్ఐ విఠల్‌రెడ్డి ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడారు. నిందితులపై పీడీ యాక్ట్ అంశం ఉన్నతాధికారులకు తెలియజేస్తామని చెప్పారు. నిందితులను అరెస్టు చేయాలని అయ్యప్ప స్వాములు రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. 24 గంటల్లోనే నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బైరి నరేశ్ గతంలో కూడా ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట్ పీఎస్, కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఠాణాల్లో నమోదైన కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.
ఇంటికి తాళం..
బైరి నరేశ్ స్వగ్రామం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నూరు గ్రామ పంచాయతీ పరిధిలోని రాములపల్లి. నరేశ్ వ్యాఖ్యలకు మద్దతు తెలిపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేస్తూ హిందూ సంఘాల ప్రతినిధులు రాములపల్లి చేరుకున్నారు. కన్నూరు గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. హిందు సమాజాన్ని అవమాన పరిచిన నరేశ్‌ను గ్రామ బహిష్కరణ చేయాలంటూ డిమాండ్ చేశారు. భయాందోళనకు గురైన నరేశ్ భార్య. ఇద్దరు పిల్లలు ఇంటికి తాళం వేసి వేరే ఊరికి వెళ్లిపోయారని గ్రామస్థులు తెలిపారు. బైరి నరేశ్ మొదటినుంచి వివాదాస్పదుడని పేర్కొన్నారు. ప్రస్తుతం నాస్తిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నరేశ్ కొనసాగుతున్నాడు.. కానీ, తల్లిదండ్రులు బైరి ధర్మయ్య, అన్నపూర్ణ, కుటుంబసభ్యులు అంతా దైవభక్తులే అని పేర్కొన్నారు. నరేశ్ నాస్తికత్వం పేరుతో పబ్లిసిటీ కోసం వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొనసాగుతున్నదని వెల్లడించారు.
నరేశ్‌కు మద్దతు తెలిపిన వ్యక్తిపై దాడి
బైరి నరేశ్ వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో మద్దతు తెలిపిన నిర్మల్ జిల్లా కుంటాల మండలం వెంకూర్ గ్రామానికి చెందిన మగ్గిడి దిగంబర్పై అయ్యప్ప స్వాములు దాడి చేశారు. శనివారం కల్లూరులోని ఓ దుకాణంలో ఉన్నట్టు తెలుసుకున్న అయ్యప్ప భక్తులు అక్కడికి వెళ్లి దిగంబర్ను నిలదీశారు. ఆగ్రహానికి గురైన భక్తులు ఆయనపై చేయి చేసుకొని.. కుంటాల ఠాణాకు తరలించారు. దిగంబర్ అంబేద్కర్ సంఘం నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పోలీసుల సమక్షంలో అయ్యప్ప భక్తులకు దిగంబర్ క్షమాపణ చెప్పారు. భక్తులు శాంతించి వెళ్లిపోయారు.
చర్చనీయాంశంగా మారిన కథనం
హిందూ దేవతలపై నోరుజారితే రచ్చరచ్చ చేసే బీజేపీ శ్రేణులు మౌనంగా ఉండటం, ఎమ్మెల్యే రాజాసింగ్ మినహా కీలక నేతలు ఎవరూ బైరి ఘటనపై సీరియస్‌గా స్పందించకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో ‘పాలిట్రిక్స్’ అనే వెబ్సైట్ శనివారం రాసిన ఒక వార్త తీవ్ర చర్చకు దారితీసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమలాపూర్‌కు చెందిన రాజేశ్ మాదిగ అనే వ్యక్తి మెసేజ్ ఆధారంగా వెబ్సైట్ ఈ కథనం రాసింది. ‘వారం కింద కరీంనగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉన్న శ్వేత హోటల్లో బైరి నరేశ్ కూర్చొని ఉన్నాడు. పలకరిద్దామని నేను వెళ్లేలోగా వేరే ఫ్రెండ్ వస్తే మాట్లాడాను. అంతలో బండి సంజయ్, శ్రవణ్ కారులోంచి దిగి లోపలికి వచ్చారు. కొంతసేపటి తర్వాత ఒక వ్యక్తి వచ్చి బైరి నరేశ్‌ను తీసుకెళ్లాడు. కలవడానికి ఎంతసేపు ఎదురుచూసినా నరేశ్ రాకపోవడంతో వెతుక్కుంటూ వెళ్లాను. రూం నంబర్ 104 బయట కమలాపూర్‌కు చెందిన బీజేపీ నాయకుడు కనిపిస్తే మాట్లాడాను. కొద్దిసేపటికే బైరి నరేశ్ బయటికి వచ్చి స్పీడ్‌గా వెళ్లిపోయాడు. ఆ తర్వాత బండి సంజయ్, శ్రవణ్ బయటికి వెళ్లిపోయారు. నేను ఆశ్చర్యంగా పాకిస్థాన్, భారత్ ఒకే హోటల్లో మీటింగ్ పెట్టినట్టుంది అని అనగానే.. ఆ బీజేపీ నేత బండి సంజయ్ అన్న రాజకీయం మామూలుగా ఉండదు అని చెప్పాడు. ఇది జరిగి వారం అవుతున్నది. ఆ తర్వాత నేను ఈ విషయం గురించి ఆలోచించలేదు. నిన్న నరేశ్ వీడియో బయటకు వచ్చాక ఒక క్లారిటీ వచ్చింది’ అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ కథనంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
హరీశ్‌రావుపై బీజేపీ తప్పుడు ప్రచారం: రెడ్కో చైర్మన్ సతీశ్‌రెడ్డి
రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు సమక్షంలోనే అయ్యప్ప స్వామిపై భైరి నరేశ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని రెడో చైర్మ న్ వై సతీశ్‌రెడ్డి ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లేందుకే బీజేపీ నేతలు పాత వీడియోను ప్రస్తుత వీడియో అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గత ఏడాది సిద్దిపేటలో అంబేదర్ విగ్రహ ఆవిషరణ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న భైరి నరేశ్ రాజ్యాంగ నిర్మాత అంబేదర్ గురించి మాట్లాడారు. ఆ తర్వాత మాట్లాడిన మంత్రి హరీశ్‌రావు భైరి నరేశ్ ప్రసంగించిన తీరును అభినందించారు. గత ఏడాది జరిగిన కార్యక్రమాన్ని ఇప్పుడు జరిగినట్టుగా బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. బీజేపీ తప్పుడు ప్రచారాలను మానుకోవాలని హెచ్చరించారు. అయ్యప్పస్వామి గురించి భైరి నరేశ్ చేసిన వ్యాఖ్యలు సమర్థనీయం కాదని చెప్పారు. కోట్లాది ప్రజలు పూజించే అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు చెప్పారు.