ఇబ్రహీంపట్నం, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): దశాబ్దాలుగా ఆ రెండు గ్రామాల సరిహద్దుల్లో ఉన్న భూములకు రైతులు వెళుతున్నారు. గుట్టలుపోను… చదును ఉన్న చోట సాధ్యమైనంత వ్యవసాయం చేస్తున్నారు. డొంక మార్గమో… రైతులు సమిష్టిగా వదులుకున్న దారో… నిన్నటిదాకా వాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. కానీ పొలాలకు వెళ్లేందుకు అకస్మాత్తుగా వాళ్లకు వంద ఫీట్ల రహదారి కావాలని కోరిక పుట్టింది. వెంటనే ఒక నిర్మాణ సంస్థను ఆశ్రయించారు. వారు రైతుల కోరిక మేరకు వాళ్ల భూముల్లోనే వంద ఫీట్ల విశాలమైన రహదారులు నిర్మిస్తున్నారు. మరి.. ఇంతకీ ఆ రైతులు తమకున్న అర ఎకరమో, ఒకటో, రెండో ఎకరాలను రహదారి నిర్మాణానికి ఇస్తే ఇంకా వాళ్లకు భూములెక్కడివి? భూములే నిర్మాణంలో పోయిన తర్వాత రహదారి ఎందుకు?? రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం -అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల సరిహద్దున ‘అసైన్డ్ భూముల్లో వెంచర్’ వ్యవహారంలో తాజాగా తెరపైకి వచ్చిన హైడ్రామా ఇది. అసైన్డ్ భూముల నుంచి దర్జాగా రోడ్ల నిర్మాణం చేపడుతున్న వైనంపై ‘నమస్తే తెలంగాణ’లో కథనం రావడంతో కొందరు రైతులు తెర మీదకొచ్చారు. తమ భూముల్లోకి వెళ్లేందుకు రోడ్డు కావాలని ఒక నిర్మాణ సంస్థను కోరితే వాళ్లు వంద ఫీట్ల రోడ్డు వేస్తున్నారే తప్ప తమ భూములు ఎవరూ ఆక్రమించలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇతరులు వాళ్ల పొలాలకు వెళ్లేందుకు రైతులు తమ భూములను త్యాగం చేయడం… అందునా ఒక నిర్మాణ సంస్థ ఎలాంటి లాభాపేక్ష లేకుండా రోడ్డు నిర్మాణం చేపట్టడం బహుశా చరిత్రలో ఇక్కడే జరిగింది కాబోలు.
వాస్తవానికి ఇబ్రహీంపట్నం మండలంలోని నాగన్‌పల్లి గ్రామ సరిహద్దున ఉన్న సర్వేనంబరు 189లోని అసైన్డ్ భూముల మీదుగానే ఇబ్రహీంపట్నం మండలంలోని అనాజ్‌పూర్ గ్రామ పరిధిలోని భూముల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. గతంలో ఇలా వెళ్లేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు తాము రహదారి నిర్మాణం కోసం భూములు ఇచ్చామని నాగన్‌పల్లికి చెందిన కొందరు రైతులు మంగళవారం మీడియా ముందు చెప్పగా… అందులో ఉన్న వారికి గరిష్ఠంగా రెండు, రెండున్నర ఎకరాల భూమి మాత్రమే ఉంది. మరి రహదారి నిర్మాణం కోసం ఉన్న భూమి ఇస్తే వాళ్లు పోయేది ఎవరి భూముల్లోకి? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఈ రహదారి నిర్మాణం దాటిన తర్వాత నాగన్‌పల్లికి చెందిన భూములు లేవు. అవన్నీ అనాజ్‌పూర్ గ్రామానికి చెందిన భూములు. దీంతో తమ భూముల్లోకి వెళ్లేందుకే రోడ్డు నిర్మాణమని చెబుతున్న రైతుల మాటల్లో వాస్తవం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా సదరు నిర్మాణ సంస్థ రోడ్డు నిర్మాణంతో పాటు సెక్యూరిటీ వారి కోసమో, ఇతర కార్యాలయ అవసరాల నిమిత్తమో… గదుల నిర్మాణాన్ని కూడా చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు పొలాలకు వెళ్లేందుకైతే మరి ఈ గదుల నిర్మాణం ఎందుకోసమో మాత్రం అటు రైతులు, ఇటు నిర్మాణ సంస్థ మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం.
ప్రభుత్వం పంపిణీ చేసిన అసైన్డ్ భూములను నిర్మాణ సంస్థకు లీజు ప్రాతిపదికన ఇవ్వడంతో పాటు అందులో రహదారుల నిర్మాణం చేపడుతుండటంతో ఇబ్రహీంపట్నం రెవెన్యూ అధికారులు నాగన్‌పల్లి గ్రామ రైతులకు గతంలోనే నోటీసులు జారీ చేశారు. పీవోటీ కింద ఆ భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని అందులో పేర్కొన్నట్టు తెలిసింది. ఒకవైపు యథేచ్ఛగా రోడ్ల నిర్మాణం చేపడుతున్నా పనులను నిలువరించని అధికారులు నోటీసుల గడువు పూర్తి కాగానే పీవోటీ కింద భూములను స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. నిర్మాణ సంస్థ ద్వారా తమ భూముల్లో రోడ్లు వేయిస్తున్నామని నాగన్‌పల్లికి చెందని కొందరు రైతులు మంగళవారం ప్రకటించిన విషయం ఇబ్రహీంపట్నం తహసీల్దార్ సునీత దృష్టికి తీసుకువెళ్లగా… పొలాలకు వెళ్లేందుకు వంద పీట్ల రోడ్లు ఎందుకు? అని ప్రశ్నించారు. ఎలాంటి నిర్మాణం చేపట్టాలన్నా ప్రభుత్వ అనుమతి ఉండాలని, అలాంటి అనుమతి ఆ రోడ్లకు లేదని చెప్పారు. అసైన్డ్ భూముల్లో నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదని ఆమె కుండబద్దలు కొట్టారు. కాగా ఈ నెల 7వ తేదీన అధికారులు రైతులకు నోటీసులు ఇచ్చిన దరిమిలా గడువు ఈ నెల 22తో ముగియనుంది.