హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): శాంతిభద్రతల సమస్య సృష్టిస్తున్న వ్యక్తిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తే.. ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమీక్షించి తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది. నిరంతరంగా రౌడీషీట్ కొనసాగించడం చెల్లదని జస్టిస్ ఎన్ తుకారాంజీ ఇటీవల తీర్పు వెలువరించారు. 2008లో నమోదు చేసిన రౌడీషీట్‌ను రద్దు చేయాలంటూ హైదరాబాద్‌లోని తలాబ్‌కట్టకు చెందిన మహమ్మద్ ఖలీద్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ తీర్పు చెప్పారు. పిటిషనర్‌పై ఎలాంటి కేసులు లేకపోయినప్పటికీ పోలీసులు రౌడీషీట్‌ను కొనసాగించడం అన్యాయమని న్యాయవాది వాదించారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది ప్రతివాదన చేస్తూ, ఏడు కేసుల్లో నిందితుడిగా పిటిషనర్ ఉన్నారని చెప్పారు. వాదనల తర్వాత హైకోర్టు, పిటిషనర్‌పై రౌడీషీట్ కొనసాగింపు చెల్లదని తేల్చింది. పోలీసులు రికార్డుల్లో నమోదు చేయాలని తెలిపింది. రౌడీషీట్‌ను కొనసాగించాలో లేదో నిర్ణయం తీసుకోవాలని పేరొంది.