హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలన్న నిబంధనపై జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. దీనిపై చట్టసభల్లోనే విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇద్దరి కంటే ఎకువ సంతానం ఉన్నవారు స్థానిక సంస్థల కు పోటీచేయరాదన్న పంచాయతీరాజ్ చట్ట నిబంధనను సవాలు చేస్తూ నల్లగొండ జిల్లాకు చెందిన ఆవుల నాగరాజు ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేయడాన్ని తప్పుపట్టింది. బాధితులు కానివారు పిల్ ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నిస్తూ.. పిటిషనర్‌కు రూ.25 వేల జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ రేణుక ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.