హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న కేసులో మంగళవారం హైకోర్టులో విచారణ ముగిసింది. ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్‌ను అనర్హులుగా ప్రకటించాలన్న పిటిషన్లపై హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీళ్లపై సుదీర్ఘ వాదనలను విన్న ద్విసభ్య ధర్మాసనం తన తీర్పును వాయిదా వేసింది. అంతకుముందు బీఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది మోహన్‌రావు వాదన వినిపించారు. సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్ చేసే అర్హత అసెంబ్లీ కార్యదర్శికి లేదని తెలిపారు. దీనిపై ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి వాదన వినిపిస్తూ.. స్పీకర్ విధుల్లోకి కోర్టులు జోక్యం చేసుకునేందుకు వీల్లేదని తెలిపారు. దీంతో విచారణ ముగిసినట్టు ప్రకటించిన సీజే ధర్మాసనం.. తన తీర్పును రిజర్వు చేసింది.