హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ అమీర్‌పేట మండలంలోని సర్వే నంబర్ 129/3లో 26,136 చదరపు గజాల స్థలాన్ని అక్రమంగా తాకట్టుపెట్టి రుణాలు పొందినట్టు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనాచౌదరి తదితరులపై నమోదైన కేసు దర్యాప్తు ఎందుకు ఆలస్యమైందో చెప్పాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు పిటిషనర్ హబీబ్ అల్లాదిన్ తరఫు న్యాయవాది వాదన వినిపిస్తూ వోల్టాస్ సంస్థకు తన క్లయింట్ లీజుకు ఇచ్చిన 26,136 చదరపు గజాల స్థలాన్ని సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ సంస్థ తాకట్టు పెట్టి ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి రూ.91 కోట్ల రుణాన్ని తీసుకున్నదని, వర్మ రియల్టర్స్ సంస్థ హామీగా ఉన్నదని వివరించారు. రుణాన్ని చెల్లించకపోవడంతో రూ.400 కోట్ల విలువైన స్థలాన్ని బ్యాంకు వేలానికి పెట్టిందని తెలిపారు. ఈ వ్యవహారంలో సుజనాచౌదరితోపాటు 17 మందిపై ఫిబ్రవరి 1న సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశామని, అయినా ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని వివరించారు. ఈ నేపథ్యంలో దర్యాప్తును త్వరగా పూర్తిచేసేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. అనంతరం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు.. తదుపరి విచారణను జనవరి 20కి వాయిదా వేసింది.