హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి మృతి కేసులో ఆరోపణలు ఎదురొంటున్న ఎంఏ సైఫ్ అలీ వివరణ విన్న తర్వాత అతని సస్పెన్షన్‌పై తగిన నిర్ణయం తీసుకోవాలని వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సైఫ్ అలీ ర్యాగింగ్ చేయడం వల్లే ప్రీతి మరణించిందంటూ ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అతడిని కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ సైఫ్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం జస్టిస్ సూరేపల్లి నంద విచారణ జరిపారు.
సైఫ్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ, కనీసం వివరణ కూడా కోరకుండా, వాదనలు చెప్పే ఆవకాశం కల్పించకుండా తల్లిదండ్రుల ఫిర్యాదుపై సైఫ్‌ను అన్యాయంగా సస్పెండ్ చేశారని తెలిపారు. సస్పెన్షన్ రద్దుకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కాలేజీ అధికారులు సైఫ్ వాదనలు విన్న తర్వాత సస్పెన్షన్‌పై తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిన హైకోర్టు పిటిషన్‌పై విచారణ ముగిసినట్లుగా ప్రకటించింది. అనస్థీషియా చదువుతున్న ప్రీతిని సైఫ్ అలీ ర్యాగింగ్ చేసి వేధించారని, స్నేహితులతో కలిసి తమ కుమార్తెకు విషపూరితమైన ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ప్రీతి మరణించిందని గత ఫిబ్రవరిలో ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.