హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మునుగునూరులో ప్రభుత్వ భూమి ఆక్రమణపై వివరణ ఇవ్వాలని, ఆ భూమి రక్షణకు చేపట్టే చర్యలేమిటో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వనికి నోటీసులు జారీ చేసింది. సర్వే నెం.90పీలో రూ.50 వేల కోట్ల విలువైన 6.28 ఎకరాల భూమిని కొందరు ఆక్రమించుకుని, అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, దీనిపై ఫిర్యాదు చేసినా అధికారుల చర్యలు తీసుకోవడం లేదని దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ యారా రేణుక ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ప్రతివాదులకు నోటీసులు జారీచేసి, విచారణను వాయిదా వేసింది.
ఇండస్ట్రియల్ పార్పై ప్రభుత్వానికి చుక్కెదురు
హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పారు ఏర్పాటు కోసం వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల, హకీంపేటలో కొందరు రైతుల భూమిని సేకరించరాదన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేసేందుకు హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించింది. స్టే ఎత్తివేయాలని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి చేసిన విన్నపాన్ని తోసిపుచ్చింది. పిటిషనర్లకు చెందిన 8 ఎకరాల భూమి సేకరణపై యథాతథ స్థితిని కొనసాగించాలని స్పష్టం చేసింది. ఈ వివాదాన్ని సింగిల్‌జడ్జి వద్దే తేల్చుకోవాలని పేర్కొంటూ.. ప్రభుత్వ అప్పీల్‌ను సింగిల్ జడ్జి వద్దకు పంపాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఆ వ్యాజ్యంపై త్వరగా విచారణ పూర్తి చేయాలని సింగిల్ జడ్జికి సూచించింది.