హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై గెలుపొంది కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకటరావుపై అనర్హత వేటు వేయాలని కోరు తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు విచారణకు స్వీకరించింది. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేసేలా స్పీకర్‌కు ఉత్తర్వులివ్వాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఇచ్చిన పిటిషన్లపై విచారణ ఏ దశలో ఉన్నదో తెలుపుతూ కౌంటర్లు దాఖలు చేయాలని స్పీకర్ కార్యాలయం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘాలను కూడా కోరింది. తదుపరి విచారణను జూలై 27వ తేదీకి వాయిదా వేశారు.