హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తేతెలంగాణ) : ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు, జేఏసీ నిర్వహించనున్న ‘చలో బస్‌భవన్’ను అడ్డుకునేందుకు ప్రభుత్వం చేసిన కుట్రను కార్మికులు ఛేదించారు. బస్‌భవన్ వద్ద నిరసనతో కూడిన మాస్ మీటింగ్‌కు అనుమతిస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినట్టు జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం థామస్‌రెడ్డి తెలిపారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చలో బస్‌భవన్‌కు వచ్చేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కార్మికులను ప్రభుత్వ, యాజమాన్యాలు అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. అందులో భాగంగా 5న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏడాదిపాలన సంబురాల సభలకు ప్రతి డిపో నుంచి బలవంతంగా కార్మికులను తరలించేందుకు ఆదేశాలు ఇచ్చినట్టు జేఏసీ భావిస్తున్నదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలుచేయకుండా కార్మికులను ఎందుకు తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు. కార్మికుల్ని భయభ్రాంతులకు గురిచేసి సంబురాలకు తీసుకెళ్తే.. అకడకి వెళ్లిన తర్వాత తమ డిమాండ్లను గట్టిగా అరుస్తూ నినాదాలు చేయాలని కన్వీనర్ మౌలానా, కో-కన్వీనర్లు కత్తుల యాదయ్య సుద్దాల సురేశ్, బీ యాదగిరి కార్మికులకు సూచించారు.