హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): ఉపరిత ఆవర్తన ద్రోణి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, దక్షిణ జార్ఖండ్ మీదుగా బంగాళాఖాతం వరకు సముద్రమట్టం నుంచి 3.1-5.8 కి.మీ ఎత్తులో కొనసాగుతుందని.. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణశాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దీంతో ఈ పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టు తెలిపింది. భారీ వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించింది. గురువారం వరకు మిగతా అన్ని జిల్లాలకూ ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు పేర్కొన్నది. మంగళవారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు అంచనా వేసినట్టు వివరించింది. గడిచిన 24 గంటల్లో మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్, హనుమకొండ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసినట్టు వెల్లడించింది. అత్యధికంగా మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో 5.86 సెం.మీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో 5.50 సెం.మీ, మణుగూరులో 4.75 సెం.మీ, కరకగూడెంలో 4.32 సెం.మీ, పినపాకలో 4.25 సెం.మీ, జూలూరుపాడు 3.9 సెం.మీ, ములుగు జిల్లా మల్లంపల్లిలో 4.60 సెం.మీ, వరంగల్ జిల్లా దుగ్గొండిలో 4.28 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనట్టు తెలిపింది.
9జిల్లాలోని 230 మండలాల్లో లోటు వర్షపాతం
ఈనెలలో సగటు సాధారణ వర్షపాతం 227.4 మి.మీ ఉండగా.. సోమవారం వరకు 56.8 మి.మీ వర్షపాతం నమోదైందని వాతావరణశాఖ పేర్కొన్నది. ఇది ఈనెల సాధారణ వర్షపాతం కంటే 40శాతం అధికంగా నమోదైనట్టు తెలిపింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభమై దాదాపు 40రోజులు అవుతున్నప్పటికీ 10 మండలాల్లో తీవ్రలోటు, 9 జిల్లాల్లోని 230 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది.