వాన చినుకుకు పట్నం వణికిపోతున్నది.
నీటిచుక్క నాటుబాంబులా భయపెడుతున్నది.
రోడ్డుమీదికొస్తే ఇంటికి చేరుతామన్న నమ్మకం లేదు.
ఇంట్లోనే ఉన్నా.. బతికి బట్టకడతామన్న భరోసా లేదు.
ఏ మ్యాన్‌హోల్ ఎక్కడ మింగేస్తుందో! ఏ నాలా ఎక్కడ కబళిస్తుందో!
గాఢనిద్రలో ఏ గోడ విరిగిపడుతుందో? ఏ కరెంటు తీగ ఎప్పుడు కాటేస్తుందో!
ఏ అపరాత్రి వేళనో.. ముంచెత్తిన వరదతో ఎవరి కథ ఎలా ముగిసిపోతుందో!
మేఘావృతమైన ఆకాశాన్ని చూడంగానే దిగులుమేఘం కమ్ముకుంటున్నది.
రహదారి సర్ప పరిష్వంగాల మధ్య కారు కదులుతలేదు. కాలు కదులుతలేదు!
ట్రాఫిక్ జంజాటంలోనే సగటు జీవి సగం బతుకు తెల్లారిపోతున్నది.
ఇది నగరమా? నిత్య నరకమా?
అధికార యంత్రాంగం స్పందించదు! సర్కారు సమీక్షించదు!
ఢిల్లీ చక్కర్లే తప్ప, మున్సిపల్ మంత్రి కూడా అయిన ముఖ్యమంత్రి పట్టించుకున్నదీ లేదు!
ఇన్చార్జ్ మంత్రి ఇటుపొంటి చూసిందీ లేదు. మేయర్, డిప్యూటీ మేయర్ జాడలేదు!
కాంగ్రెస్‌లో చేరిన సిటీ ఎమ్మెల్యేలు కనిపిస్తలేరు! కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా గాయబ్!
మాయమాటలు చెప్పి ఓట్లేయించుకున్న బీజేపీ ఎంపీలు ఈటల, కొండా అతాపతా లేరు.
చివరికి ఎవరు దిక్కయ్యిండ్రయ్యా అంటే.. మళ్లా గులాబీ దళమే! బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే!
క్షేత్రస్థాయిలో కనపడుతున్నదీ, కలుస్తున్నదీ వాళ్లే! కలయతిరుగుతున్నదీ వాళ్లే!
హైడ్రా తెచ్చి హైదరాబాద్ నెత్తిన రుద్దిన సర్కారు.. ఇప్పుడు చద్దర్ కప్పుకుని నిద్దురబోతున్నది!
పన్నులు కట్టిన ప్రజలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నరు. ఓట్లేసిన పాపానికి నీట్లో నిలబడి ‘పాహిమాం’ అని వేడుకుంటున్నరు! ఓ గాడ్..! సేవ్ మై హైదరాబాద్!
పల్లెల్లో వాగుల్లో గల్లంతవడం ఇన్నాళ్లూ విన్నం. కానీ పట్నంలో కొట్టుకుపోవడం ఇప్పుడు చూస్తున్నం. నగరంలో చెరువులుండేవి. ఇప్పుడు నగరమే చెరువైంది. ఇంతకుముందు రోడ్లమీదే నీళ్లు నిలిచేవి. ఇప్పుడు బస్తీలు మునుగుతున్నయ్. నాలాల పరిరక్షణ మాటున రిటైనింగ్ గోడలను హైడ్రా కూల్చడంతో ఇప్పుడు ఇండ్లలోకే నీళ్లొస్తున్నయ్. నీళ్లొచ్చుడే కాదు, ఏకంగా ఇంట్లో ఉన్న మనుషులు కొట్టుకుపోతున్నరు. చచ్చిపోవడమే దారుణం అనుకుంటే.. అంతకన్నా దరిద్రం, నాలుగైదు రోజులైనా మృతదేహాలు దొరకకపోవడం!
దీనికంటే దౌర్భాగ్యం..
ఇంత జరుగుతున్నా..
ఎవరూ రాకపోవడం!
ఎవరికీ పట్టకపోవడం!
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): రాజధాని హైదరాబాద్‌లో చినుకు పడితే నగరవాసులు నరకం చూస్తున్నారు. రహదారులు చెరువులుగా మారుతున్నాయి. నడుములోతు నీళ్లు కాలువలను తలపిస్తూ భయపెడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చాలా కాలనీలు నీట మునిగిపోతున్నాయి. ప్రజలు ఇండ్లకే పరిమితం కావాల్సిన దుస్థితి నెలకొంటున్నది. పలు బస్తీలలో అయితే ఇండ్లలోకి నీరు చేరి.. జనం అవస్థలు పడుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకున్నారు. మొగులు అయిందంటే జనం బుగులు పెట్టుకుంటున్నారు. వామ్మో.. వానొస్తాందని భయపడుతున్నారు. ప్రయాణంలో ఉన్నప్పుడు వాన పడిందంటే.. ఇక అంతే సంగతులు. ఎక్కడి జనం అక్కడే నిలిచిపోతున్నారు.
ఇంటికి, పనిచోటకు సురక్షితంగా వెళ్లడంపై ఆందోళన చెందుతున్నారు. డ్రెయిన్లు, నాలాల నిర్వహణలో సర్కార్ ఫెయిల్ అయిందని, కనీసం వాటర్, ట్రాఫిక్ క్లియరెన్స్‌లోనూ అట్టర్ ఫ్లాప్ అయిందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వ శాఖల మధ్య లోపించిన సమన్వయంతోనే మునుపెన్నడూ లేని స్థాయిలో ఇప్పుడు సమస్య ఎదురవుతున్నదని మండిపడుతున్నారు. బీఆర్ఎస్ పాలనలో శాఖల మధ్య సమన్వయాన్ని, సమస్యలు పరిష్కరించిన తీరును ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. నాడు కుండపోత వర్షం పడ్డుప్పుడు కూడా ఎదురుకాని అవస్థలు.. నేడు చిన్నపాటి వర్షానికి ఎందుకు వస్తున్నాయని నిలదీస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతగావడం లేదని విమర్శిస్తున్నారు.
బుధవారం రాత్రి కురిసిన వర్ష బీభత్సం నుంచి హైదరాబాద్ నగరవాసులు కోలుకోకముందే గురువారం సాయంత్రం జోరువాన దంచికొట్టింది. ఒక్కసారిగా క్లౌడ్ బరస్ట్ అయినట్టుగా వర్షం కురిసి, నగరాన్ని ముంచిపోయింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో తక్కువ సమయంలోనే భారీ వర్షపాతం నమోదైంది. హబీబ్‌నగర్‌లో గోడకూలడంతో.. పక్కనే నిలిపి ఉంచిన పలు కార్లు ధ్వంసమయ్యాయి. బహుదుర్పురాలో అత్యధికంగా 8.65 సెంటీమీటర్ల వర్షం కురిసిందంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. వరద ఉధృతిని దృష్టిలో పెట్టుకుని, ముసారాంబాగ్ బ్రిడ్జీని అధికారులు మూసివేశారు. బుధవారం నాడు లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని ప్రభుత్వ యంత్రాంగాలు, సిబ్బంది తొలగించడంలో అలసత్వం వహించాయి. దీంతో గురువారం నాటి వానతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా హైదరాబాద్ చిగురుటాకులా వణికిపోయింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో గంటసేపు నిలబడి కొట్టిన వాన నగరాన్ని జలమయం చేసింది.
సిటీలోని ప్రధాన రహదారులు రోడ్లలా కనిపించనేలేదు. చెరువులు, కాలువలను తలపించాయి. ఎక్కడికక్కడ రోడ్లపై నీరు నిలవడంతో రాకపోకలు స్తంభించాయి. గంటల తరబడి జనం అవస్థలు పడ్డారు. ముఖ్యంగా ఐటీ కారిడార్, గచ్చిబౌలి, రాయదుర్గం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహదీపట్నం, ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ, తెలుగుతల్లి ఫ్లైఓవర్, బేగంపేట, సికింద్రాబాద్, అంబర్‌పేట, ముసారాంబాగ్ బ్రిడ్జి ప్రాంతాల్లో జనం రోడ్లపై ఎటూ కదలలేని పరిస్థితి ఏర్పడింది. చాంద్రాయణగుట్ట, బ్ంలగూడ, ఐఎస్ సదన్, షేక్‌పేట ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. ఛత్రీనాక డివిజన్లోని శివగంగనగర్లో 5 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. ఆ ప్రాంతంలోని 300 కుటుంబాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. ప్రభుత్వం, హైడ్రా అధికారులు కాపాడాలంటూ స్థానికులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కనిపించింది.
గురువారం దంచికొట్టిన వానతో నగరంలోని మెట్రో స్టేషన్ల కింద, అండర్‌పాస్‌ల వద్ద, బ్రిడ్జీల కింద వరద ఉధృతి చెరువులను మించి కనిపించింది. ముందుకు వెళ్లే పరిస్థితి లేక ప్రజలు బెంబేలెత్తిపోయారు. వరదలో కొట్టుకుపోతామని ఆందోళన చెందారు. ఎక్కడికక్కడ నిలిచిపోయారు. ప్రజానీకం ఆగిపోయిన చోట కూడా ఆందోళనగానే గడపాల్సి వచ్చింది. ఎక్కడ గుంత ఉందో, ఎక్కడ తెరిచిన మ్యాన్ హోల్ ఉందో తెలియని దుస్థితిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని క్షణక్షణం వణుకుతూనే ప్రయాణం సాగించారు. నగరంలో రోడ్లపై నిలిచిన వాన నీటిని తొలగించడంలో ప్రభుత్వ యంత్రాంగం క్రియాశీలకంగా కనిపించలేదని ప్రజలు మండిపడ్డారు. రోడ్ల మీద ఎక్కడ కూడా వరద నీటి తొలగింపు బృందాలు కనిపించడంలేదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ట్రాఫిక్ నియంత్రణలోనూ స్పష్టమైన వైఫల్యం ఉందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రయాణికులు అవస్థలు పడకుండా బాధ్యత నిర్వహించాల్సిన యంత్రాంగం.. కనీసం దారి మళ్లింపుపై కూడా దృష్టి పెట్టలేదని విమర్శించారు.
బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌లో వర్షపు నీరు, మురుగునీటి నిర్వహణ, నాలాల మరమ్మతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. వర్షం పడినప్పుడు వెంటనే నీరంతా నాలాల్లోకి వెళ్లేలా డ్రెయిన్లను క్లియర్ చేస్తూ ఉండేది. పద్ధతి ప్రకారం అమలు చేసిన నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సత్ఫలితాలు ఇచ్చింది. వర్షాకాలం రాకముందే ప్రభుత్వం మాన్సూన్ యాక్షన్ ప్లాన్ రూపొందించేది. నాటి పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లో వాన నీటి నిర్వహణను ప్రత్యేక శ్రద్ధతో పరిశీలించేవారు. క్షేత్రస్థాయిలోనూ అధికారులను అప్రమత్తం చేస్తూ పర్యవేక్షించేవారు. ప్రభుత్వం రోడ్ల సమర్థ నిర్వహణ, మరమ్మతులు, గుంతలు పూడ్చే పనులు చేపట్టేది.
జీహెచ్ఎంసీ, జలమండలి, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, వైద్యారోగ్య, విద్యుత్తుశాఖ, పోలీసు, ట్రాఫిక్ అధికారులతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టేది. వాతావరణశాఖ నుంచి వచ్చే వర్షపు సూచనల ఆధారంగా బలగాలను అప్రమత్తం చేసేది. మరో గంటలో పలానా చోట వర్షం పడుతుందంటే అక్కడికి డీఆర్ఎఫ్, ట్రాఫిక్ సిబ్బంది వెళ్లి మోహరించేవారు. ముఖ్యంగా వర్షపు నీరు ఎక్కడెక్కడ ఎక్కువగా నిలుస్తుందో ముందే అంచనా వేయడం వల్ల.. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టేవారు. శాఖలన్నీ కూడా పరస్పర సహకారంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించేవి. దీంతో వర్షం పడ్డ కాసేపటికి రోడ్లపై నీరు కనిపించకపోయేది.
రాష్ట్రవ్యాప్తంగా బుధ, గురువారాల్లో కురిసిన భారీ వర్షం ప్రజలను బెంబేలెత్తించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సిద్దిపేట, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినట్టు వాతావరణశాఖ తెలిపింది. సికింద్రాబాద్‌లో 13.85 సెం.మీ, ముషీరాబాద్‌లో 13.11 సెం.మీ, అమీర్‌పేటలో 12.76 సెం.మీ, మారేడ్‌పల్లిలో 11.78 సెం.మీ, ఖైరతాబాద్‌లో 9.74 సెం.మీ, సిద్దిపేట జిల్లా వర్గల్లో 11.10 సెం.మీ, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో 9.70 సెం.మీ, సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో 9.18 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడటంతో రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణశాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో మరో మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరికలు జారీచేసింది. గురువారం హైదరాబాద్‌తోపాటు సిద్దిపేట, జగిత్యాల, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసినట్టు తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, క్యుమిలోనింబస్ మేఘాల వల్లే ఈ భారీ వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది.
కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రానే సర్వరోగ నివారిణి అన్నట్టుగా తెరపైకి తీసుకొచ్చింది. వర్షాలు పడ్డప్పుడు హైదరాబాద్ మునగకుండా చూసే బాధ్యత మొత్తం హైడ్రాదే అని సీఎం రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ పెద్దలు ఢంకా బజాయించి చెప్పారు. దీంతో మిగిలిన శాఖలు తమ పాత్రకు పరిమితమయ్యారు. జీహెచ్ఎంసీ, పోలీస్, జలమండలి అధికారులు, సిబ్బంది కాడి పక్కన పెట్టేశారు. అనుభవం, అవగాహన లేని హైడ్రా ఒకవైపు.. ‘సర్కారుకే పట్టనప్పుడు మాకెందుకులే!’ అని వదిలేసిన మిగిలిన విభాగాలు మరోవైపు.. నడిమిట్ల నగరం నరకయాతన పడుతున్నది. ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే.. క్రెడిట్ గేమ్‌లో అధికారులు ఆపసోపాలు పడుతున్నారు.
రాజకీయ నాయకత్వం నిద్ర నటిస్తున్నదని నగర ప్రజలు మండిపడుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ హయాంలో వర్షాకాల పరిస్థితులను ఎదుర్కొనే సమన్వయం, సమష్టి ప్రణాళిక లోపించిందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో చెప్పడానికి.. వర్షం పడ్డప్పుడు నడిరోడ్డుపై ప్రవహిస్తున్న చెరువుల్లోనే స్పష్టంగా కనిపిస్తున్నదని విమర్శలు గుప్పిస్తున్నారు. హైదరాబాద్ హైడ్రా బ్యాడ్ అయిందని వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత బల్దియా ఎన్నికల్లో ప్రతిబింబిస్తుందని నెటిజన్లు వ్యాఖ్యానించారు.
వాగు దాటలేక.. రాత్రంతా బడిలోనే
కుమ్రంభీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : వాగు ఉప్పొంగడంతో ఉపాధ్యాయులు రాత్రంతా పాఠశాలలోనే బస చేయాల్సి వచ్చింది. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చెల్కగూడ-వాడిగొంది గ్రామాలు సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఆయా గ్రామాల్లోని పాఠశాలల్లో పనిచేస్తే ఉపాధ్యాయులు బుధవారం ఉదయం విధులకు వెళ్లారు. సాయంత్రం తిరిగి వెళ్తుండగా, ఎగువన వర్షాలకు చెల్కగూడ వాగు ఉప్పొంగింది. వాగు నిండుగా ప్రవహిస్తుండటంతో తిరిగి చెల్కగూడ పాఠశాలకు వెళ్లి రాత్రంగా అక్కడే ఉన్నారు. గురువారం ఉదయం గ్రామస్థులు కలిసి వీరిని వాగు దాటించారు. కాగా చెల్కగూడ వాగుపై వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ చెల్కగూడ, వాండిగొంది గ్రామస్థులు గురువారం వాగులో దిగి అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. వంతెన లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
బుధ, గురువారాల్లో కురిసిన వర్షాలకు హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో నీట మునిగిన ఓ కాలనీ
గురువారం హిమాయత్‌నగర్ వద్ద వరదనీరు ముంచెత్తిన రోడ్డుపై వెళ్తూ బైక్‌పై నుంచి జారిపడిన ఓ కుటుంబం
గురువారం రాత్రి వాన వెలిసిన అనంతరం మాసబ్ ట్యాంక్ వద్ద ట్రాఫిక్‌జామ్‌లో చిక్కుకున్న వాహనాలు
గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి జలమయమైన రాజ్‌భవన్ రోడ్డు
సికింద్రాబాద్ ఆర్పీ రోడ్డు వద్ద మోకాల్లోతు నీళ్లలో వాహనం ఆగిపోవడంతో నెట్టుకెళ్తున్న యజమాని