పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లాలో శుక్రవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. వడగండ్ల వర్షం కురియడంతో పాటు పలుచోట్ల పిడుగులు పడ్డాయి. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పెద్దపల్లి పట్టణంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కర్ణాటక నుంచి ఒడిశా వరకు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ద్రోణి శుక్రవారం స్థిరంగా కొనసాగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో శనివారం పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
కాగా ఆదివారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడుతుందని తెలిపింది. కాగా గడిచిన 24 గంటల్లో 28 జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసినట్లు పేర్కొన్నది. ఇందులో మహబూబాబాద్, ములుగు, వరంగల్, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, యాదాద్రి భువనగిరి, నాగర్కర్నూల్, రాజన్న సిరిసిల్ల, జనగాం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినట్లు తెలిపింది. రాష్ట్రంలో అత్యధికంగా వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మంగళవారి పేట 8.80,. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం ఉప్పరిగూడెం 6.83, నల్లగొండ జిల్లా శాలిగౌరారం 6.85 సెంటీ మీటర్ల వర్షం కురిసినట్లు టీఎస్డీపీఎస్ వెల్లడించింది.