Telangana | హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ)/న్యూస్‌నెట్‌వర్క్: కర్ణాటక, మహారాష్ట్రలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉరకలేస్తున్నది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టును దాటుకుని బిరబిరామంటూ జూరాలకు పరుగులు తీస్తున్నది. జూరాల ప్రాజెక్టు 17 స్పిల్‌వే గేట్లను అధికారులు తెరిచారు. శనివారం సాయంత్రం వరకు ఇన్‌ఫ్లో 90,800 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 1,04,416 క్యూసెక్కులుగా నమోదైనట్టు అధికారులు తెలిపారు. జూరాల పూర్తిస్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలకుగాను 7.645 టీఎంసీలకు చేరింది. తుంగభద్ర డ్యాం 68 టీఎంసీలకు చేరింది. ఇన్‌ఫ్లో 1,02,744 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 1,527 క్యూసెక్కులుగా నమోదైంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 29 వేల క్యూసెక్కుల వరద కొనసాగుతున్నది. విద్యుదుత్పత్తి ద్వారా దిగువన నాగార్జునసాగర్‌కు నీరు విడుదల చేస్తున్నారు.
గోదావరి బేసిన్‌లోని నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతున్నది.శనివారం రాత్రి తొమ్మిది గంటలకు 15 వేల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80 టీఎంసీలు) కాగా, శనివారం రాత్రి వరకు 1066.80 అడుగులు (18.443 టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉన్నది. కడెం ప్రాజెక్టుకు ఎగువ నుంచి 15,338 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా, 3 గేట్లు ఎత్తి దిగువకు 11,022 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు (7.603 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 690.400 (5.345 టీఎంసీలు) అడుగుల మేర నీరు ఉన్నది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సమీపంలోని అడ ప్రాజెక్టుకు 1778 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 1941 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బరాజ్‌కు శనివారం ఇన్‌ఫ్లో 3,73,500 క్యూసెక్కులు ఉండగా, బరాజ్‌లోని మొత్తం 85 గేట్లు ఎత్తి అంతేమొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బరాజ్ రివర్ బెడ్ సముద్ర మట్టానికి 88 మీటర్లు కాగా, ప్రస్తుతం వరద ప్రవాహం 93.10 మీటర్ల ఎత్తులో పారుతున్నది. అన్నారం బరాజ్‌కు మానేరుతోపాటు చిన్న, చిన్న కాల్వల ద్వారా 16,500 క్యూసెక్కులు వస్తున్నట్టు అధికారులు తెలిపారు. వచ్చిన నీటిని మొత్తం 66 గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు.
ఎగువన కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 35.50 అడుగులకు చేరింది. మహారాష్ట్ర, ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నది ఉప్పొగుతున్నది. దేవాదుల ఎత్తిపాతల ప్రాజెక్టు వద్ద గోదావరి నీటిమట్టం 80 మీటర్లకు చేరింది. ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి శనివారం సాయంత్రం 12.210 మీటర్ల ఉధృతితో ప్రవహిస్తున్నది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమ్మక్క బరాజ్‌కు శనివారం ఎగువ నుంచి 4,58,340 క్యూసెక్కుల ప్రవాహం వస్తున్నట్టు అధికారులు తెలిపారు. మొత్తం 59 గేట్లు ఎత్తి నీటిని దిగువకు పంపిస్తున్నారు.