హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): వానకాలంలో సహజంగా విద్యుత్తు వినియోగం తక్కువగా ఉంటుంది. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉన్నది. జోరు వానకాలంలోనూ విద్యుత్తు వినియోగం ఎండాకాలాన్ని తలపిస్తున్నది. గత నెల వరకు మధ్యస్థంగా ఉన్న విద్యుత్తు వినియోగం ఈ నెలలో అమాంతం పెరిగింది. ఈ డిమాండ్‌ను అధిగమించేందుకు రాష్ట్ర విద్యుత్తు సంస్థలు విద్యుత్తును కొనాల్సిన పరిస్థితి. విద్యుత్తు వినియోగం అంచనాలకు మించి పెరుగుతుండటంతో డిస్కమ్‌లు రోజుకు రూ.8-9 కోట్లు వెచ్చించి విద్యుత్తును కొనుగోలుచేయాల్సి వస్తున్నది. డిమాండ్ మరింత పెరిగితే విద్యుత్తు కొనుగోలుకు మరింత ఖర్చు చేయాల్సి వస్తున్నదని విద్యుత్తు సంస్థల అధికారులు చెప్తున్నారు.
జూలైలో వినియోగం తక్కువే
వాస్తవానికి ఈ ఏడాది జూలైలో విద్యుత్తు వినియోగం తక్కువగానే నమోదైంది. గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా రోజుకు సగటున 180 మిలియన్ యూనిట్ల విద్యుత్తు మాత్రమే వినియోగమైంది. కానీ, గత వారంలో ఈ వినియోగం 190 మిలియన్ యూనిట్లకు చేరింది. జూలైలో గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ 10 వేల మెగావాట్ల కంటే తక్కువగా ఉండగా.. ఈ నెలలో అది 14 వేల మోగావాట్లకు పెరిగింది. సెలవు దినంగా పరిగణించే ఆగస్టు 15న గరిష్ఠ డిమాండ్ 14,268 మెగావాట్లకు, విద్యుతు వినియోగం 287.48 మిలియన్ యూనిట్లకు చేరుకున్నది. ఇది ఏప్రిల్, మే నెలల్లో నమోదయ్యే వినియోగం కంటే అధికం కావడం గమనార్హం. ఇటీవల వర్షాలతో కృష్ణా రిజర్వాయర్లలో ఇన్‌ఫ్లో పెరగడంతోపాటు భూగర్భజలాలు సైతం వృద్ధి చెందాయి. ఫలితంగా వ్యవసాయానికి నీటి వినియోగం తగ్గడంతో మోటర్లు, పంపుసెట్లు నడపాల్సిన అవసరం అంతంతమాత్రంగానే ఉన్నది. వేసవితో పోల్చితే ఉష్ణోగ్రతలు తగ్గడంతో గృహ వి ద్యుత్తు వినియోగం క్రమంగా తగ్గుతున్నది.