హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): యుక్తవయసులో పరస్పర అంగీకారం తో ఏర్పడిన ప్రేమను ఆధారం చేసుకొని తన పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం సుప్రీంకోర్టు, పలు హైకోర్టులు జారీచేసిన ఉత్తర్వులకు విరుద్ధమని, తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని బండి భగీరథ్ హైకోర్టును అభ్యర్థించారు. ప్రస్తుతం రిమాండ్లో ఉన్న భగీరథ్ తరఫున దాఖలైన బెయిల్ పిటిషన్పై జస్టిస్ కే సుజన బుధవారం విచారణ చేపట్టారు. ప్రతివాదులైన పోలీసులు, బాధితురాలి తల్లి తమ వాదనలతో కౌంటర్లు దాఖ లు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. తాను నిర్దోషినని, తప్పుడు ఆరోపణలతో కేసులో ఇరికించారని భగీరథ్ తన పిటిషన్లో పేరొన్నాడు. బాధితురాలితో 2025 జూన్లో పరిచయం ఏర్పడి, ఇద్దరి మధ్య ప్రేమ సంబంధం కొనసాగిందని, ఆ తర్వాత బాధితురాలి తల్లి ఇచ్చి న ఫిర్యాదు ఆధారంగా అన్యాయంగా పోక్సో కేసు నమోదు చేశారని ఆరోపించాడు. పోలీసుల దర్యాప్తు ఇప్పటికే పూర్తయ్యిందని, బాధితురాలి వాంగ్మూలాలు నమోదు చేశారని, వైద్య పరీక్షలు కూడా పూర్తయ్యాయని, కీలక సాక్షులందరినీ విచారించారని తెలిపాడు.