హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 పోస్టుల భర్తీ నిమిత్తం 2022 నోటిఫికేషన్‌ను రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్ జారీపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై జస్టిస్ కార్తీక్ శుక్రవారం విచారణ ప్రారంభించారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది జొన్నలగడ్డ సుధీర్ వాదనలు వినిపిస్తూ.. 503 పోస్టుల భర్తీ కోసం 2022లో నోటిఫికేషన్ జారీ అయినప్పటికీ వివిధ కారణాలతో పరీక్ష రద్దయిందని తెలిపారు. ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేయకుండా మరో 60 పోస్టులను కలిపి కొత్త నోటిఫికేషన్‌ను జారీ చేయడం చెల్లదన్నారు. దీనిపై ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్‌రెడ్డి ప్రతివాదన చేస్తూ.. టీజీపీఎస్సీ రాజ్యాంగబద్ధమైన సంస్థ అని, పరీక్షను రద్దుచేసి తాజాగా నోటిఫికేషన్ జారీచేసే అధికారం టీజీపీఎస్సీకి ఉంటుందని చెప్పారు. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది.