వికారాబాద్, నవంబర్ 13: ఒకపక్క తనపై దాడి జరుగలేదని కలెక్టర్ చెప్తున్నారని, మరోవైపు దాడి చేశారంటూ పలువురు రైతులను అరెస్టు చేశారని ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. లగచర్ల ఘటన ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఎత్తిచూపుతున్నదని తెలిపారు. రైతులతోపాటు మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డిని అదుపులోకి తీసుకోవడం దారుణమని వెల్లడించారు.
దాడి జరుగలేదని కలెక్టరే చెప్తున్నారు కదా
నరేందర్ రెడ్డి ఐదేండ్లు ఎమ్మెల్యేగా పనిచేసిండు. కార్యకర్తలు తమకు ఏమైనా సమస్యలు ఉంటే ఆయనతో మాట్లాడుతుంటారు. ఇందులో తప్పేముంది? ఓ ప్రజా ప్రతినిధిగా సమస్యలు వినడం తప్పా? తనపై దాడి జరుగలేదని స్వయంగా కలెక్టరే చెప్పినా వినకుండా రైతులను అరెస్టు చేయడం, మాజీ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకోవడం ఎంతవరకు కరెక్టు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు జరిగాయా? ప్రభుత్వ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. సీఎం, మంత్రులు రైతుల దగ్గరికి వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవాలి.
-కొప్పుల మహేశ్వర్‌రెడ్డి (పరిగి మాజీ ఎమ్మెల్యే)
రైతుల ఆగ్రహాన్ని అర్థం చేసుకోండి
బీఆర్ఎస్ పాలనలో రైతులను మెప్పించి ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేశాం. కానీ కాంగ్రెస్ పాలనలో రైతులు తిరగబడుతున్నరు. అధికారుల మీద కోపంతో లగచర్ల ఘటన జరుగలేదు. రేవంత్ సర్కార్‌పై రైతులు ఎంత ఆగ్రహంగా ఉన్నారో ఈ ఘటనను చూస్తే అర్థమవుతున్నది. ఇప్పటికైనా రైతులతో సీఎం రేవంత్ మాట్లాడాలి. చిన్నచిన్న ఘటనలకు భేషజాలకు పోవద్దు. అయినా సీఎం తన సొంత నియోజకవర్గ రైతులతో మాట్లాడటానికి ఇబ్బంది ఏది?. ప్రజలు, రైతులకు ఇబ్బంది కలిగే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తే నిలదీస్తూనే ఉంటాం.
-మెతుకు ఆనంద్ (వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే)
కాంగ్రెస్ అసమర్థ పాలనకు నిదర్శనం
సీఎం సొంత నియోజకవర్గంలోనే ప్రజలు తిరగబడ్డారంటే కాంగ్రెస్ అసమర్థ పాలనకు ఇంతకంటే నిదర్శనం ఇంకొకటి ఉంటుందా?. ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయాలంటే ముందుగా రైతులతో మాట్లాడాలి. వారిని ఒప్పించాలి. అంతేగానీ రైతులను ఇబ్బందిపెట్టేలా వ్యవహరించకూడదు. లగచర్ల ఘటన ప్రభుత్వంపై జరిగిన దాడిగానే భావించాలి.
-డీకే అరుణ, (మహబూబ్‌నగర్ ఎంపీ)
భూములు గుంజుకోవడానికే..గిరిజన నేత అంజయ్య
ఓవైపు గిరిజనుల అభివృద్ధికి పెద్దపీట వేస్తామని ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతున్నదని.. మరోవైపు వారి భూములను గుంజుకోవడానికి యత్నిస్తున్నదని తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య విమర్శించారు. సాగుకు ఉపయోగపడని భూముల్లో కంపెనీలు ఏర్పాటు చేయాలని, పచ్చని పొలాల్లో కాదని తెలిపారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.