(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): భవిష్యత్తులో జరగబోయే అనేక పరిణామాల గురించి వీరబ్రహ్మేంద్రస్వామి వందల ఏండ్ల క్రితమే తన కాలజ్ఞానంలో వివరించారు. అందులో ఒక ఆసక్తికర అంశం.. ‘రాబోయే కాలంలో ఢిల్లీ పరిపాలకుల్లో మరో నరసింహుడు ఉంటాడ’ని వివరించారు. దీన్ని ఒక సందర్భంలో కడప జిల్లాకు చెందిన వీరబ్రహ్మేంద్రస్వామి భక్తుడొకరు పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఉత్సుకతతో చరిత్ర గురించి ఆరా తీశారు. గడిచిన నాలుగు వందల ఏండ్లలో ఢిల్లీని కేంద్రంగా పరిపాలించిన రాజుల పేర్లనన్నింటినీ వడబోశారు. ఎక్కడా నరసింహ అనే పేరు ఉన్న రాజుకానీ, పరిపాలకుడు కానీ ఆయనకు కనిపించలేదు. అదే సమయంలో పీవీ ఢిల్లీలో ప్రధానిగా దేశాన్ని ఏలుతున్నారు. దీంతో కాలజ్ఞానంలో వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన నరసింహనామధేయుడు పీవీ నరసింహారావునే అని కుటుంబరావు సూత్రీకరించారు.