హైదరాబాద్ సిటీబ్యూరో/ కొండాపూర్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్న విదేశీ విద్యార్థినిపై వర్సిటీ హిందీ ప్రొఫెసర్ లైంగిక దాడికి యత్నించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ దారుణంపై విద్యార్థి సంఘాలు శనివారం క్యాంపస్ ఆవరణలో ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొన్నది. కాగా, సదరు ప్రొఫెసర్‌పై రిజిస్ట్రార్ సస్పెన్షన్ వేటు వేశారు.
వివరాల్లోకి వెళ్తే.. థాయిలాండ్‌కు చెందిన విద్యార్థిని(25) నెల రోజుల క్రితం హెచ్‌సీయూలో ఎంఏ హిందీ మొదటి సంవత్సరంలో చేరారు. క్యాంపస్‌లోని విదేశీ విద్యార్థులుండే హాస్టల్లో ఉంటున్నారు. ఈ నెల 2న సాయంత్రం 4 గంటల సమయంలో వర్సిటీ హిందీ ప్రొఫెసర్ రవి రంజన్ (63) బాధిత విద్యార్థిని వద్దకు వెళ్లాడు. హిందీలో వీక్ ఉన్నావని, తన ఇంటికి వస్తే హిందీ నేర్పిస్తానని నమ్మించాడు. ప్రొఫెసర్ మాటలు నమ్మిన బాధితురాలు ప్రొఫెసర్ కారులో అతని ఇంటికి వెళ్లింది.
ఈ క్రమంలో ఆమెకు మద్యం కలిపిన శీతలపానీయం ఇచ్చాడు. తాగనని నిరాకరించినా ఆమెతో బలవంతంగా తాగించాడు. అనంతరం లైంగికదాడికి ప్రయత్నించగా బాధితురాలు ప్రతిఘటించింది. వెంటనే తాను ఉంటున్న హాస్టల్ ఇన్చార్జికి ఫోన్ ద్వారా సమాచారమిచ్చింది. హాస్టల్ ఇన్చార్జి ప్రొఫెసర్‌కు ఫోన్ చేసి, విద్యార్థిని హాస్టల్‌కు తీసుకురావాలని సూచించారు.
దీంతో ప్రొఫెసర్ తన కారులో యువతిని రాత్రి 8:30 గంటల సమయంలో క్యాంపస్‌లో వదిలేసి వెళ్లాడు. అధికారులు యువతికి క్యాంపస్ హాస్పిటల్లో చికిత్స చేయించారు. విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగికదాడికి యత్నించిన విషయం తెలుసుకున్న వర్సిటీ విద్యార్థి సంఘాలు శనివారం క్యాంపస్ ప్రధాన ద్వారం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ దేవేశ్ నిగమ్ అక్కడికి చేరుకొని ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో విద్యార్థులు ఆందోళనను విరమించారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు ప్రొఫెసర్ రవిరంజన్‌పై 354, 354(ఏ) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడిపై గతంలో మూడు కేసులున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా బాధితురాలు బేగంపేటలోని థాయిలాండ్ ఎంబసీ కార్యాలయంలో కూడా ఘటనపై ఫిర్యాదు చేసింది.