అమరావతి : ఏపీలో కూటమి ప్రభుత్వం అక్షరాస్యత పెరుగుదల ( Literacy growth ) పై తప్పుడు గణాంకాలతో ప్రచారం చేసుకుంటుందని వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ( YS Jagan Mohan Reddy ) ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ( Nara Lokesh ) రెడ్‌బుక్ పాలనపై దృష్టిని తగ్గించి సంబంధిత శాఖపై శ్రద్ధ వహించాలని ట్విట్టర్ వేదిక ద్వారా సూచించారు.
2024లో 72.6 శాతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత రేటు 2026లో 82.1 శాతానికి పెరిగిందని విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. కానీ 2026 క్యాలెండర్ సంవత్సరానికి సంబంధించిన అక్షరాస్యత గణాంకాలను ఇప్పటివరకు ఏ అధికారిక సంస్థా విడుదల చేయలేదని పేర్కొన్నారు. అసలు 2026 సంవత్సరమే ఇంకా పూర్తికాలేదు. మరి 82.1 శాతం అనే లెక్క ఎక్కడి నుంచి వచ్చిందని జగన్ ప్రశ్నించారు.
అధికారిక గణాంకాలు స్పష్టంగా అందుబాటులో ఉన్నప్పటికీ, 82.1 శాతం అంటూ తప్పుడు లెక్కలతో రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం దురదృష్టకరమని వెల్లడించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ తీరువల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు తగ్గుతుండగా, ప్రైవేట్ పాఠశాలల్లో నమోదు పెరుగుతోందని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన యూడీఐఎస్ఈ (UDISE )గణాంకాలే ఇందుకు నిదర్శనమని తెలిపారు.
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు విద్యను మరింత అందుబాటులోకి ఎలా తీసుకురావాలి? ప్రభుత్వ పాఠశాలలను ఎలా బలోపేతం చేయాలి? అనే అంశాలపై దృష్టి పెట్టాల్సిన టీడీపీ కూటమి ప్రభుత్వం మోసపూరిత ప్రచారాలతో లేనిపోని గొప్పలు చెప్పుకోవడంలోనే నిమగ్నమైందని ఆరోపించారు.