Tamil Nadu CM Vijay | తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు సీఎం విజయ్. రాష్ట్రానికి భారీగా పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఆయన ఈ నెల 10న బ్రిటన్‌కు పయనం కానున్నారు. సెప్టెంబర్ 10 నుంచి 16 వరకు యూకేలో జరిగే పలు పారిశ్రామికవేత్తల సమావేశాల్లో ఆయన హై-లెవెల్ చర్చలు జరపనున్నారు. అయితే, ఈ అధికారిక పర్యటన రాజకీయ వర్గాలతో పాటు సినీ సర్కల్స్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కొంతకాలంగా సీఎం విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. ఆయన సతీమణి సంగీత విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో తాజాగా ఆమె ఆ కేసును వెనక్కి తీసుకోవడం లాంటి పరిణామాలు తమిళనాట హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు తొలగిపోయాయని, త్వరలోనే వారు మళ్లీ ఒక్కటవుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో లండన్‌లో ఉంటున్న భార్య సంగీత, కుమార్తె దివ్యను విజయ్ ఈ టూర్లో కలవనున్నారనే ఊహాగానాలు ప్రస్తుతం ఊపందుకున్నాయి.
మరోవైపు, ఇదే సమయంలో ప్రముఖ నటి త్రిష కూడా ఓ సినిమా షూటింగ్ నిమిత్తం యూరప్‌లోనే ఉండటం గమనార్హం. అధికారిక పర్యటన నిమిత్తం లండన్ వెళ్తున్న విజయ్ను త్రిష కలుస్తారా? లేదా అనే కోణంలోనూ సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. మొత్తానికి, తమిళనాడు ముఖ్యమంత్రి హోదాలో విజయ్ చేపడుతున్న తొలి విదేశీ ట్రిప్.. అటు పెట్టుబడుల సాధన కోసమే కాకుండా, ఆయన వ్యక్తిగత జీవితం చుట్టూ అల్లుకున్న పరిణామాల కారణంగానూ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.