న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నివాస అవసరాల కోసం కేటాయించిన భవనాలను, వాణిజ్య కార్యకలాపాలకు వినియోగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు మున్సిపల్ అధికారులను ఆదేశించింది. జస్టిస్ ఆహ్సానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలను జారీ చేసింది. ఏ ప్రాంతాన్ని నివాస లేదా వాణిజ్య వినియోగానికి కేటాయించారో స్పష్టంగా నిర్దేశించని ప్రాంతాలను కూడా అధికారులు పరిశీలించాలని కోర్టు పేర్కొంది. అయితే ప్రస్తుతానికి అలాంటి ప్రాంతాలపై ఏ విధమైన చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. చెన్నైలో అక్రమ నిర్మాణాలకు సంబంధించిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ అంశాన్ని దేశవ్యాప్తంగా పరిశీలించాలని నిర్ణయించింది.
షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం, 1989 లోని నిబంధనల రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. ఇందులో 2018లో సవరణ ద్వారా బలోపేతం చేసిన నిబంధనలు కూడా ఉన్నాయి. ఈ చట్టం దుర్వినియోగం కాకుండా చూసేందుకు తగిన రక్షణ ఏర్పాట్లు ఇప్పటికే ఉన్నాయని పేర్కొన్న న్యాయస్థానం సవరణను సమర్థిస్తూ తాము గతంలో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించడానికి నిరాకరించింది.
భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వీ మోహనలతో కూడిన ధర్మాసనం బ్రిజ్‌భూషణ్ సైని దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది. ఎస్సీ/ఎస్టీ చట్టంలోని నిబంధనలు రాజ్యాంగంలోని 14, 21, 22 అధికరణల కింద హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయని పిటిషనర్ ఆరోపించారు. ఏకపక్ష అరెస్టులు, చట్టాన్ని దుర్వినియోగం చేయడం నుంచి రక్షణ కల్పించాలని కోరారు. అయితే ఈ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది.