హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం ఎంప్లాయీస్ జేఏసీ నేతలతో సర్కార్ జరుపుతున్న చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్నది. జేఏసీ నేతలతో చర్చలు మరోసారి వాయిదా పడ్డాయి. మంగళవారం రాత్రి చర్చలు జరుగాల్సి ఉండగా.. అవి ప్రారంభంకాకుండానే బుధవారానికి వాయిదాపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చల కోసం జేఏసీ నేతలు సాయంత్రం 5:30 గంటల కల్లా సచివాలయానికి చేరుకున్నారు. అయితే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సచివాలయంలోనే పలు సమీక్షలు నిర్వహించడంతో సీఎస్ వీటికి హాజరయ్యారు. చర్చల కోసం వెళ్లిన జేఏసీ నేతలు సీఎస్ కోసం వేచిచూడాల్సి వచ్చింది.
సీఎస్ రాకపోవడం, చర్చలు జరిపే అంశంపై స్పష్టత లేకపోవడంతో నేతలంతా గంటల తరబడి సచివాలయంలో సీఎస్ చాంబర్లో పడిగాపులు కాశారు. గంటల తరబడి వేచిచూసినా పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. చర్చలు జరిపే విషయంపై క్లారిటీ లేకపోవడంతో తీవ్ర అసంతృప్తితో జేఏసీ నేతలు వెనుదిగారు. జేఏసీ నేతలంతా నాంపల్లిలోని టీఎన్జీవో భవన్‌కు వెళ్లారు. ఈ తరుణంలో చర్చలను బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదావేసినట్టు సీఎస్ సంజయ్‌జాజు జేఏసీ చైర్మన్, సెక్రటరీ జనరల్ మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావుకు ఫోన్ చేసి చెప్పారు. తాము ప్రస్తావించిన నాలుగు ప్రధాన డిమాండ్లపై సర్కార్ సానుకూల నిర్ణయం తీసుకుంటుందని, ఆయా అంశాలపై బుధవారం ప్రకటన చేసే అవకాశం ఉన్నదని మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు ఆశాభావం వ్యక్తంచేశారు.
జేఏసీ నేతలతో చర్చలు రెండు రోజుల్లో నాలుగుసార్లు వాయిదాపడ్డాయి. ఉద్యోగుల జేఏసీ నేతలతో సోమవారం సీఎస్ చర్చలు జరిపిన విషయం తెలిసిందే. జేఏసీ నేతల వాదనలు విన్న సీఎస్ చర్చల కొనసాగింపును సోమవారం రాత్రికి వాయిదావేశారు. అయితే, చివరికి రాత్రి చర్చలు కొనసాగించకుండా మంగళవారం సాయంత్రం 6 గంటలకు వాయిదా వేశారు. అవి కూడా జరుగలేదు. మళ్లీ చర్చలను బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదావేశారు. ఇలా వాయిదాల మీద వాయిదాలు వేయడం పట్ల ఉద్యోగ సంఘాల నేతలు అసహనం వ్యక్తంచేస్తున్నారు.
పది లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల మనోభావాలతో సీఎస్ ఆటలాడుకుంటున్నారని ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్ డాక్టర్ మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు. యావత్తు ఉద్యోగలోకం ఆశగా వేచిచూస్తున్న తరుణంలో చర్చల పేరిట కాలం వెళ్లదీయడం గర్హనీయమని పేర్కొన్నారు. ఇది ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తున్నదని, దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ‘ఉద్యోగులారా.. రేపు రా’ అన్నట్టుగా తమ పరిస్థితి తయారైందని మరో ఉద్యోగ నేత వాపోయారు.