హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగర శివారులో పుష్ప సినిమాను తలపించే చేజింగ్ సీన్ రిపీట్ అయింది. పోలీసులు హవాలా ముఠాను వెంబడించి చాకచక్యంగా పట్టుకున్నారు. దుండగులు కారులో హవాలా డబ్బు తరలిస్తున్నట్టుగా టాస్క్‌ఫోర్స్ పోలీసుల నుంచి అందిన సమాచారం మేరకు బోయిన్పల్లి పోలీసులు శామీర్‌పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద మాటువేశారు. పోలీసులను చూసిన దుండగులు కారు ఆపకుండా వేగం పెంచారు. కానీ పోలీసులు 15 కిలో మీటర్లు వెంటాడి ఇద్దరు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. కారులోని ప్రతీ భాగం లోపల కనబడకుండా దాచిన కరెన్సీ నోట్ల కట్టలు గుర్తించారు. ఈ మొత్తం రూ.4.05 కోట్లు ఉన్నట్టు నార్త్‌జోన్ డీసీపీ రశ్మి పెరుమాళ్ తెలిపారు.
డీసీపీ కార్యాలయంలో రశ్మి పెరుమాళ్ శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. హవాలా కేసులో అరెస్టయిన నిందితులు గుజరాత్‌కు చెందిన ప్రకాశ్ మోతీభాయ్ ప్రజాపతి, ప్రగ్నేశ్ కీర్తిభాయ్ ప్రజాపతిగా గుర్తించినట్టు తెలిపారు. హవాలా డబ్బులను నాగ్‌పూర్ నుంచి బెంగళూరుకు తీసుకెళ్తుండగా హైదరాబాద్ శివారులో పట్టుకున్నామని వివరించారు. ఓ పాత కేసు దర్యాప్తులో భాగంగా భారీ రాకెట్ బయటపడినట్టు చెప్పారు. 2024 ఆగస్టులో నాగోల్‌కు చెందిన విశ్వనాథచారి తన మిత్రులు ప్రదీప్, రవితో కలిసి బోయినన్పల్లికి చెందిన సుభాన్పాషాతో క్యాష్-ఆర్టీజీఎస్ ఎక్స్చేంజ్ డీల్ కుదుర్చుకున్నారు.
చారి, ప్రదీప్, రవి… సుభాన్కు రూ.50 లక్షలు నగదు చెల్లించారు. కానీ సుభాన్.. ఆర్టీజీఎస్లో పంపాల్సిన డబ్బులు పంపలేదు. దీంతో చారి, అతడి మిత్రులు నిరుడు డిసెంబర్లోనే బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది మొదట్లోనే టాస్క్‌ఫోర్స్ పోలీసులు సుభాన్‌ను పట్టుకుని విచారించారు. కానీ అతడి అరెస్ట్‌ను గోప్యంగా ఉంచారు. సుభాన్ ద్వారా హవాలా లింక్‌లను పోలీసులు ఆరా తీశారు. తాను గుజరాత్‌కు చెందిన ముఠాతో కలిసి హవాలా దందా నడుపుతానని సుభాన్ వెల్లడించాడు.
ఇందులో ప్రజాపతి అనే వ్యక్తి పేరును ప్రస్తావించాడు. అప్పట్నుంచే ప్రజాపతి కదలికలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టారు. నాగ్‌పూర్ నుంచి బెంగళూరుకు భారీ మొత్తంలో డబ్బులు తరలివస్తున్నట్టుగా సమాచారం సేకరించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు, బోయిన్పల్లి పోలీసులు, మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల లోకల్ పోలీసులతో కలిసి స్థానికంగా మాటు వేశారు. నిందితుల వాహనాన్ని ఫాలో అవుతూ వచ్చారు. టాస్క్‌ఫోర్స్ అప్రమత్తం చేయడంతో అప్పటికే బోయిన్పల్లి పోలీసులు శామీర్‌పేట వద్ద మాటువేశారు. దుండగులు పారిపోయేందుకు ప్రయత్నించగా శామీర్‌పేట పోలీసులు వెంటాడి పట్టుకున్నారు.
పోలీసుల చేజింగ్, కారులో డబ్బుల తరలింపు వీడియోలు సోషల్‌మీడియలో వైరల్‌గా మారాయి. ఈ డబ్బులు ఎవరికి చెందినవి, బెంగళూరులో ఎవరి కోసం తరలిస్తున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదంతా భారీ హవాలా నెట్‌వర్క్‌గా భావిస్తున్నారు. హవాలా డబ్బులను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన బోయిన్పల్లి డీఐ ఆనంద్‌కుమార్, డీఎస్సై చందర్, నార్త్‌జోన్ సైబర్ సెల్ ఎస్సై శ్రీవర్ధన్, కార్ఖానా ఎస్ఐ అశోక్‌రెడ్డి, కానిస్టేబుళ్లు మురళి, రాజేశ్, శివకుమార్, శరత్‌రాజ్, రోషిణి కుమారి, కుమారస్వామి, హోంగార్డులు శ్రీనివాసులు, తులసీదాస్‌ను డీసీపీ రశ్మి పెరుమాళ్ ప్రత్యేకంగా అభినందించారు.