నిజామాబాద్ రూరల్ : సబ్బండ వర్ణాల ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీకి హ్యాట్రిక్ విజయాన్ని సాధించి పెడతాయని టీఎస్ ఆర్టీసీ చైర్మన్( RTC Chairman), రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్(Bajireddy Goverdhan) అన్నారు. బుధవారం నిజామాబాద్ రూరల్ మండల బీఆర్ఎస్(BRS) ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీ(BJP)ని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. మతాల పేరిట రాజకీయాలు చేయాలని చూస్తే ప్రస్తుతం ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో(Karnataka Election) ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పడమే ఇందుకు నిదర్శనమని వెల్లడించారు.
తొమ్మిదేండ్ల పాలనలో సీఎం కేసీఆర్(CM KCR) నేతృత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించి దేశంలోనే నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోవడం గర్వించదగిన విషయమని చెప్పారు. లక్షల కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక విపక్షాలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారాలు చేయడమే పనిగా పెట్టుకున్నాయన్నారు.
కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ లేదని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ నాయకులు చెప్పే మాయమాటలకు నమ్మి అమాయక ప్రజలు మోసపోకుండా వారిని చైతన్యపర్చాలని సూచించారు. మరికొన్ని నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కార్యకర్తలు సైనికులుగా పని చేయాల్సిన అవశ్యకతను గుర్తించాలన్నారు. సమ్మేళనంలో ఎమ్మెల్సీ వీజీ గౌడ్, నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు తదితరులు పాల్గొన్నారు.