హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ) : టీజీపీఎస్సీ వన్ టైమ్ రిజిస్ట్రేషన్(ఓటీఆర్) అప్డేట్ చేసుకుందామనుకునే అభ్యర్థులకు తిప్పలు తప్పడంలేదు. ఆదివారం వెబ్సైట్ సర్వర్డౌన్ అయ్యింది. ఫలితంగా ఓటీఆర్ ఎడిట్ చేసుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నించగా, సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఓ అభ్యర్థి ప్రయత్నిస్తే అరగంటపాటు లోడింగ్ ప్లీజ్ వెయిట్ అని వచ్చింది. ఓటీపీ మాత్రం రాలేదు. మరో అభ్యర్థి శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ప్రయత్నించినా.. ఓటీఆర్ ఓపెన్కాలేదు. ఇలా అనేక మంది అభ్యర్థులు ఇబ్బందులుపడ్డారు. ఈ నెల 25తో ఓటీఆర్ అప్డేషన్ గడువు ముగియనున్నది. దీంతో అభ్యర్థులకు టెన్షన్ పట్టుకున్నది. ఇదే విషయంపై టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశంను ‘నమస్తే తెలంగాణ’ ఫోన్లో సంప్రదించగా.. అభ్యర్థులు వాడే ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉండటం వల్ల వారికి సమస్య తలెత్తి ఉండవచ్చని తెలిపారు. సర్వర్ డౌన్ సమస్యను చాలా మటుకు పరిష్కరించామని వెల్లడించారు. అభ్యర్థులకు అప్డేట్ చేసేందుకు తగిన సమయం ఇస్తామని పేర్కొన్నారు.
ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరుబాట
హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): సమస్యల పరిష్కారం, పెండింగ్ వేతనాల చెల్లింపులో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులు పోరుబాట పట్టారు. అనేకసార్లు మంత్రులు, అధికారులకు వినతిపత్రాలు ఇచ్చి విసిగిపోయిన వారు తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈనెల 29న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి రామరాజేశ్ ఖన్నా ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆరు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజలకు వైద్యసేవలందించడంలో అగ్రభాగాన నిలుస్తున్న ఎన్హెచ్ఎం ఉద్యోగులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమమని మండిపడ్డారు. వేతనాలు అందక ఇంటి అద్దెలు, పిల్లల ఫీజులు, ఈఎంఐలు కట్టనేని దీనస్థితిలో ఉన్నామని వాపోయారు. 28లోగా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 29న మహాధర్నాకు 33 జిల్లాల నుంచి ఉద్యోగులు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.