హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): వానకాలం సీజన్ ధాన్యం సేకరణ శనివారం నుంచి ప్రారంభం కానున్నది. గతంలో మాదిరిగానే గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సీజన్లో 1.51 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేయగా, ఇందులో కోటి టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందుకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా 7 వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నది.
ఇప్పటికే పంట చేతికొచ్చిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, మిర్యాలగూడ ప్రాంతంలో ధాన్యం కొనుగోళ్లను శనివారం నుంచి ప్రారంభించనున్నది. గ్రేడ్ ‘ఏ’ రకం క్వింటాల్‌కు రూ.2,060, సాధారణ రకానికి రూ.2,040గా మద్దతు ధరను ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు ఎదురయితే టోల్ ఫ్రీ 180042500333, 1967 నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం సూచించింది.