హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ పూర్తిగా కోలుకొని మళ్లీ మామూలు మనిషిలా బయటకు రావాలని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆకాంక్షించారు. కిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను హరీశ్‌రావు నేతృత్వంలోని
బీఆర్ఎస్ నేతల బృందం గురువారం పరామర్శించింది. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ దురదృష్టకరమైన ఘటనలో గాయపడిన శ్రీతేజ్‌ను కేసీఆర్ సూచనలతో పరామర్శించామని తెలిపారు.
శ్రీతేజ్ కోలుకుంటున్నాడని, వైద్యానికి స్పందిస్తున్నాడని వైద్యులు చెప్తున్నారని వివరించారు. తొక్కిసలాటలో మరణించిన రేవతి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తాను మరణిస్తున్నా, కొడుకు శ్రీతేజ్‌ను రక్షించుకోవడానికి రేవతి పడిన తపన అందరి మనసులను కలిచివేసిందని చెప్పారు. ఇది రాజకీయాలు మాట్లాడే సందర్భం కాదని, ప్రతిపక్షాలపై సీఎం రేవంత్‌రెడ్డి నెపాన్ని నెడుతున్నప్పుడు రాజకీయాలు మాట్లాడలేక ఉండని పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. సంధ్య థియేటర్ ఘటన జరిగిన పది రోజుకుల సీఎం, మంత్రులు స్పందించారని చెప్పారు.
గురుకులాల్లో చనిపోతున్న పిల్లల కుటుంబాలను రేవంత్‌రెడ్డి, ఆయన మంత్రివర్గం ఎందుకు పరామర్శించడం లేదని ప్రశ్నించారు. గురుకులాల పిల్లల మాతృమూర్తుల శోకాన్ని సీఎం ఎందుకు గుర్తించడం లేదని నిలదీశారు. చట్టం అందరికీ సమానమే అంటున్న సీఎం… కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్యకు కారణమైనవారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు.
సాయిరెడ్డి రాసిన ఆత్మహత్య లేఖలో పేర్కొన్న తన సోదరులపై రేవంత్‌రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. రేవంత్ సోదరులను కనీసం పోలీస్‌స్టేషన్‌కు కూడా పిలవరా? అని ప్రశ్నించారు. సినీ ఇండస్ట్రీ, ప్రభుత్వ చర్చల గురించి రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. ప్రేమానురాగాలతో మనసులు గెలవాలే గానీ, భయాందోళనలు సృష్టించి కాదని హితవు చెప్పారు.