హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) : కంచ గచ్చిబౌలి భూముల్లో రేవంత్ సరారు పర్యావరణ, జీవవైవిధ్య విధ్వంసానికి పాల్పడిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. 50 జేసీబీలతో రాత్రివేళల్లో అటవీ సంపదను కూల్చివేసి వన్యప్రాణుల మనుగడను ప్రమాదంలో పడేసిందని పేర్కొన్నారు. కంచే.. చేనుమేసిన చందంగా సర్కారు సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను ఉల్లంఘించిందని, అటవీ, వన్యప్రాణి, వాల్టా చట్టాలకు తూట్లు పొడిచిందని వెల్లడించారు. ఈ మేరకు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి హరీశ్‌రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం గురువారం 11 పేజీలతో రిప్రంజంటేషన్, 200 పేజీల నివేదికను అందజేసింది.
హైదరాబాద్‌లోని హోటల్ తాజ్‌కృష్ణలో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చైర్మన్ సిద్ధార్థదాస్, సభ్యులు చంద్రప్రకాశ్ గోయల్, సునీల్ లెమనయ్య, చంద్రదత్లను హరీశ్‌రావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, కాలేరు వెంకటేశ్, పార్టీ నేతలు దేవీప్రసాద్, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కలిశారు. కంచ గచ్చిబౌలి భూముల్లో రేవంత్ సరారు చేస్తున్న పర్యావరణ విధ్వంసం, ఉల్లంఘనలు, హెచ్‌సీయూ విద్యార్థులు, ప్రకృతి ప్రేమికులు, పర్యావరణవేత్తలు లేవనెత్తుతున్న అంశాలు, వాస్తవాలతో కూడిన నివేదికను సమర్పించారు. అనంతరం తెలంగాణభవన్‌లో పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘పేద రైతు తన పొలంలోని చింతచెట్టునో, యాపచెట్టునో కొడితే పోలీసులు, ఎమ్మార్వో వెళ్లి లక్షల్లో జరిమానా విధిస్తరు.. వేల సంఖ్యలో చెట్లు నరుకుతుంటే ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నరు? రైతుకు ఒక న్యాయం, సీఎంకు ఒక న్యాయమా?’ అని నిలదీశారు. రైతుకైనా, పేద వాడికైనా, ముఖ్యమంత్రికైనా సమాన న్యాయం ఉండాలని డిమాండ్ చేశారు.
ఆవాసాలు కోల్పోయి జంతువులు ఇండ్లల్లకు వస్తున్నాయి. మూడు జింకలు చచ్చిపోయినయి. జింకను చంపినందుకు బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌ను జైల్లో పెట్టిండ్రు. మరి మూడు జింకలను చంపితే రేవంత్‌రెడ్డిపై ఏం చర్యలుతీసుకోవాలె? ఈ ప్రభుత్వంపై ఏం చర్యలు తీసుకోవాలె. ఏడేండ్ల శిక్ష వేయాలని చట్టం ఉన్నది. హైదరాబాద్ నడిబొడ్డున 400 ఎకరాల్లో పర్యావరణ విధ్వంసం జరిగితే ఇకడే ఉన్న పీపీబీ, అటవీశాఖ, రెవెన్యూ శాఖలు ఏం చేస్తున్నయి?
నిద్రపోతున్నయా?
అనుమతి లేకుండా చెట్లు కూల్చుతున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పీసీసీఎఫ్‌కు ఫిర్యాదు చేసినా కూడా స్పందించరా? అని హరీశ్ ప్రశ్నించారు. యూనివర్సిటీ విద్యార్థులు ధర్నా చేస్తే కనిపించడం లేదా? అని నిలదీశారు. అటవీశాఖ నేరపూరిత నిర్లక్ష్యం వల్లే వేల సంఖ్యలో చెట్లు కుప్ప కూలాయని, జింకలు మృత్యువాత పడ్డాయని విమర్శించారు. ‘2002 వాల్టా యాక్టు ప్రకారం, ఎవరైనా చెట్టు కొట్టాలంటే అనుమతి తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం 2017లో ఇచ్చిన జీవో 23 ప్రకారం.. చెట్టు కొట్టాలన్నా కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసి అటవీశాఖ అనుమతి తీసుకోవాలి. కానీ, అటు చట్టాన్ని, ఇటు ప్రభుత్వ జీవోను ఉల్లఘించారు’ అని విమర్శించారు.
ఫారెస్టు నేచర్ కలిగిన భూముల వివరాలు ఇవ్వాలని 2025 మార్చి 4న సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలను కోరితే.. ఆ రకమైన భూమలను కాంగ్రెస్ ప్రభుత్వం తెగనమ్ముతున్నదని మండిపడ్డారు. అశోక్‌కుమార్ శర్మ ఐఎఫ్ఎస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. ఫారెస్టు నిర్వచనం.. అటవీ భూమే కాదు, పట్టా భూమి అయినా పది హెక్టార్లు ఉండి, 0.4 డెన్సిటీ ఆఫ్ చెట్లు ఉండాలి. కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల్లో 0.6 డెన్సిటీ ఆఫ్ చెట్లు ఉన్నాయి. హైడ్రా కూల్చివేతల విషయంలో శని, ఆదివారాల్లో కూల్చొద్దని హైకోర్టు హెచ్చరింది. దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించింది. ఉగాది, రంజాన్ ఆదివారం సెలవులు చూసుకొని విధ్వంసం చేశారు. ప్రభుత్వం చేసిన ఉల్లంఘటనలను కమిటీకి ఆధారాలతో సహా వివరించాం’ అని హరీశ్ వెల్లడించారు.
కంచ గచ్చిబౌలి భూమిని తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్లు అప్పు తీసుకున్న ప్రభుత్వం.. అప్పు ఇప్పించిన వ్యక్తికి (బ్రోకర్ సంస్థ) రూ. 169.84 కోట్ల ఫీజు చెల్లించందని హరీశ్ విమర్శించారు. సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన తర్వాత కూడా హెచ్‌సీయూలో ఈ భూములు టీజీఐఐసీకి చెందినవే అని బోర్డులు పెట్టారని మండిప్డడారు. బీఆర్ఎస్ హయాంలో కొత్త సచివాలయం కట్టాలని నిర్ణయిస్తే ఇదే రేవంత్‌రెడ్డి 10-20 చెట్లను నరుకుతున్నారని గ్రీన్ ట్రిబ్యునన్లో ఫిర్యాదు చేయడంతోపాటు హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా కేసులు వేశారని గుర్తుచేశారు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. వందల ఎకరాల్లో లక్షల కొద్దీ చెట్లు కొడుతున్న సీఎంపై, సీఎస్‌పై, పోలీసు అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించిన పాపానికి హెచ్‌సీయూ విద్యార్థులను జైలులో పెట్టారని, దీనికి బాధ్యత హోంమంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డిదే అన్నారు.
ఒక చెట్టు నరికితే రెండు చెట్లు నాటాలనే నిబంధన ఉన్నది. అలా అనుమతి పొందిన తర్వాత చెట్టు కొట్టాలి. కానీ, కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వం ఎలాంటి దరఖాస్తు పెట్టలేదు. అటవీశాఖ అనుమతి తీసుకోలేదు. వేలాది చెట్లను పీకిపడేశారు. చెట్లు కొట్టడానికి రక్షణ కల్పించాలని పోలీస్స్టేషన్లలో టీజీఐఐసీ దరఖాస్తు చేసింది. పోలీసులు ఇది చట్టబద్ధమైందా? కాదా? అని ఆలోచన చేయాలె. చెట్లు నరకడానికి ఫారెస్టు అనుమతి ఉన్నదా? వాల్టా చట్టం అనుమతి ఉన్నదా? తెలుసుకొని పోలీసులు అనుమతివ్వాలె. కానీ, పోలీసు రక్షణలో రాత్రింబవళ్లు 50 బుల్డోజర్లు పెట్టి చెట్లను ఊచకోత కోసిండ్రు.
-బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు
ప్రభుత్వం చేయాల్సిన పనిని విద్యార్థులు చేస్తే అరెస్టు చేసి, జైల్లో పెడతారా? అని ప్రశ్నించారు. సీఎంపై ఏ పోస్టు పెట్టినా వారిని జైలులో పెడుతున్నారని, మరి ఇవాళ వేలాది చెట్లు నరికినా, జింకలను చంపినా ఎందుకు డీజీపీకి కనిపించడం లేదని నిలదీశారు. నేరం చేస్తుంటే చూస్తూ ఊరుకున్న ప్రతివారూ నేరస్తులేనని స్పష్టంచేశారు. ఆ భూములు హెచ్‌సీయూకే చెందాలని తాము కమిటీకి విన్నవించినట్టు తెలిపారు. హెచ్‌సీయూ భూము ల్లో తాము కొట్టిన వాటిలో కేవలం సుబాబుల్ చెట్లు మా త్రమే ఉన్నాయని అటవీ అధికారులు చెప్తున్నారని, సుబాబులే కాదు.. అనేక ఔషధ మొకలున్నాయని స్పష్టంచేశారు. ఈ భూ ముల్లో చెరువు కూడా ఉన్నదని, చెట్ల నరికివేతతో ఏడు చట్టాలను సీఎం రేవంత్‌రెడ్డి దుర్వినియోగం చేశారని విమర్శించారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, కాలేరు వెంకటేశ్, మాజీ మంత్రి కొప్పు ల ఈశ్వర్, పార్టీ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, దేవీప్రసాద్, హరి రమాదేవి పాల్గొన్నారు.