హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): రిటైర్డ్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గళమెత్తారు. వారి పట్ల సర్కార్ చిన్నచూపు చూస్తున్నదని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మండిపడ్డారు. పీఆర్సీ ఎప్పుడు ప్రకటిస్తారో, ఐదు పెండింగ్ డీఏలు, రిటెర్మెంట్ ఉద్యోగుల బకాయిలు ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పాలని నిలదీశారు. ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాకపోవడంతో అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. సర్కార్ చెప్తున్న మానవీయ కోణం మాటల్లో తప్ప.. చేతుల్లో లేదని మండిపడ్డారు. ఇంకా ఎంతకాలం గత ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ మీద పడి ఏడుస్తారని ప్రశ్నించారు.
మూడు నెలల్లో ఇస్తామన్న హామీ ఏమైంది?
అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో కొత్త పీఆర్సీ ఇస్తామన్న హామీ ఏమైందని అసెంబ్లీలో బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు నిలదీశారు. ఈ నెల 31తో పీఆర్సీ కమిటీ గడువు ముగుస్తుందని, గడువును మళ్లీ పొడిగిస్తారా? అని ప్రశ్నించారు. వెంటనే నివేదిక తెప్పించుకుని పీఆర్సీ ఎప్పుడిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలోనే ఐదు డీఏలు పెండింగ్‌లో పెట్టారని, ఎప్పటిలోగా చెల్లిస్తారో సమాధానం చెప్పాలని కోరారు. గతంలో కేసీఆర్ మధ్యంతర భృతి (ఐఆర్) ఇచ్చి ఆదుకున్నారని, ఐఆర్ పెంచి ఉద్యోగులకు ఉపశమనం కలిగించాలని సూచించారు.
రాష్ట్రంలో ఎంతమంది ఉద్యోగ విరమణ చేశారు? వారికి చెల్లించాల్సిన బెనిఫిట్స్ ఎంత? ప్రభుత్వం ఇప్పటివరకు ఎంత చెల్లించింది? మిగతా బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తారో సభలో స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు. సర్కార్ తీరుతో రిటైర్మెంట్ తరువాత ప్రశాంతంగా ఉండాల్సిన వారు మంత్రులు, సచివాలయం చుట్టూ తిరగాల్సి వస్తున్నదని, రోడ్ల మీద ధర్నాలు చేయాల్సిన దారుణ పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర నిధుల్లేవా? సర్కార్‌కు మనసు లేదా? అని ప్రశ్నించారు. ‘ఫ్యూచర్‌సిటీకి రూ.లక్ష కోట్లు.. మూసీకి రూ.లక్ష కోట్లు.. అందాల పోటీలకు, ఫుట్‌బాల్ షోలకు డబ్బులుంటాయి. వంద కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటారు. భట్టి మూడో క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటారు. వీటిన్నింటికీ డబ్బులుంటాయి కానీ, ఉద్యోగుల పీఆర్సీ, డీఏలకు డబ్బుల్లేవంటారు. ఇదేం పద్ధతి? అని హరీశ్‌రావు నిలదీశారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు సమస్యలపై సర్కార్ స్పష్టమైన సమాధానం చెప్పకపోవడంతో అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.
బకాయిలెప్పుడు చెల్లిస్తరు?
రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్‌ను ఇంతవరకు చెల్లించలేదని అసెంబ్లీలో బీఆర్ఎస్ విప్ కేవీ వివేకానంద విమర్శించారు. సీపీఎస్‌ను రద్దుచేసి ఓపీఎస్‌ను పునరుద్ధరిస్తామన్న హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. హైకోర్టు మొట్టికాయలేస్తే, దళారులకు కమీషన్లు ఇస్తేనే బకాయిలు విడుదల చేస్తున్నారని దుయ్యబట్టారు. రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఎప్పుడు అమలు చేస్తారని, ఐదు డీఏలను ఎప్పుడు చెల్లిస్తారని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ప్రశ్నించారు.
ఆర్టీసీ కొత్త పీఆర్సీ ఎప్పుడు?: హరీశ్‌రావు
ఆర్టీసీ సిబ్బందికి కొత్త పీఆర్సీ ఇప్పుడిస్తారో చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఆర్టీసీ అప్పాయింటెడ్ డే ఖరారుచేసి సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా ఎప్పుడు గుర్తిస్తారో, ఆర్టీసీలో యూనియన్లను ఎప్పుడు పునరుద్ధరిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.