హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ దవాఖానల్లో ఆరోగ్యశ్రీ సేవలు పెరిగాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. 2019-20లో 35 శాతంగా ఉన్న ఆరోగ్యశ్రీ సేవలు 2021-22 నాటికి 43 శాతానికి పెరిగాయని చెప్పా రు. సిబ్బందిని అభినందించారు. ఆరోగ్యశ్రీ పథకం అమలు, పురోగతిపై వైద్యశాఖ ఉన్నతాధికారులు, ఆరోగ్యశ్రీ అధికారులు, జిల్లా కోఆర్డినేటర్లు, టీమ్ లీడర్లు, అన్ని టీచింగ్, టీవీవీపీ దవాఖానల సూపరింటెండెంట్లు, డీఎంహెచ్వోలతో మంత్రి హరీశ్‌రావు గురువారం నెలవారీ సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు పేదలకు వైద్యఖర్చుల భారం లేకుండా చేయాలని సూచించారు.
ఆరోగ్యశ్రీ సేవలు పెరగటం అభినందనీయమని, ఇవి మరింత పెరిగేలా కృషి చేయాలని సూచించారు. అన్ని జిల్లా, ఏరియా దవాఖానల్లో కాటరాక్ట్ ఆపరేషన్లు చేయాలన్నారు. మోకీ లు ఆపరేషన్లు అన్ని జిల్లా, ఏరియా దవాఖానల్లో చేయాలని, ఇందుకు గాంధీ, ఉస్మానియా దవాఖానల సహకారం తీసుకోవాలని సూచించారు. బాధితులను గుర్తించేందుకు సమీప ప్రాంతాల్లో క్యాంపు లు ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే 26 సీఆర్మ్ మెషీన్లు పంపిణీ చేశామని, ఆర్థో సర్జరీలు పెరుగాలని నొక్కిచెప్పారు. సిజేరియన్లు తగ్గించి, నార్మల్ డెలివరీలు ఎకువయ్యేలా చర్యలు తీసుకోవాలని, మాతాశిశు మరణాలు పూర్తిగా తగ్గించాలని స్పష్టం చేశారు.