Harish Rao | సంగారెడ్డిలో కలుషిత నీటితో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. అందోల్‌లో మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా విజయరామరాజు, అల్లం నవాజ్ రెడ్డి వంటి ముఖ్య నాయకులను కోల్పోవడం నిజంగా ఎంతో బాధాకరమన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పార్టీకి చేసిన సేవలను ఎప్పటికీ మర్చిపోమంటూ వారికి నివాళుర్పించారు. అలయ్ బలయ్ పండుగ మన తెలంగాణ ఉద్యమంలో ఎంతో స్ఫూర్తిని నింపిందన్నారు.
పువ్వులను పూజించే గొప్ప సంస్కృతి, ప్రకృతిని పూజించే పండుగలు మన ఆత్మగౌరవానికి ప్రతీకలన్నారు. అన్ని కులాల వారు కలిసి బతుకమ్మ పండగను పంచుకోవడం, గ్రామాలు అంతా జమ్మి పెట్టుకుని అలయ్ బలయ్ చేసుకోవడం నిజంగా మన సంప్రదాయమన్నారు. కేసీఆర్ పాలనలో ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంగారెడ్డి లో కలుషిత నీటితో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరమన్నారు. మిషన్ భగీరథ ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం సురక్షిత నీళ్లు అందించిందని.. కానీ, ఇప్పుడు ఆ పని కూడా సరిగా చేయడంలేదని ఆరోపించారు. రైతుబంధు లేదని.. బతుకమ్మ చీరెలు లేవని.. రుణమాఫీ కూడా జరుగలేదన్నారు. డిసెంబర్ 9, పంద్రాగస్టు కూడా ముగిసిందని.. ఇంకా రుణమాఫీ కాలేదన్నారు. మంత్రులు డిసెంబర్ 9కి రుణమాఫీ చేస్తామని చెబుతున్నారని.. కానీ, ఏడాది కాలం గడిచినా అమలు చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.