హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో ఎంతో స్ఫూర్తిని రేపింది అలయ్ బలయ్(Alai Balai )కార్యక్రమం. పువ్వులను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ సొంతమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. సంగారెడ్డి జిల్లా అందోల్‌లో(Andol) మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్(Kranthi kiran) ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విజయరామరాజు, అల్లం నవాజ్ రెడ్డి వంటి ముఖ్య నాయకులు కోల్పోవడం బాధగా ఉందన్నారు.
వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. దసరాకి గ్రామం గ్రామం అంతా జమ్మి పెట్టుకుంటూ అలయ్ బలయ్ తీసుకునే గొప్ప సంస్కృతి కేసీఆర్ పాలనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగిందన్నారు. కానీ, నేడు పండుగపూట సంగారెడ్డిలో కలుషిత నీళ్లు తాగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మేము మిషన్ భగీరథ ద్వారా సురక్షిత నీళ్లు ఇస్తే, అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతనవడం లేదని మండిపడ్డారు.
రైతుబంధు లేదు, బతుకమ్మ చీరెలు లేవు, రుణమాఫీ కాలేదు. డిసెంబర్ 9 పోయింది, పంద్రాగస్టు పోయిందని విమర్శించారు. నిన్న మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. డిసెంబర్ 9 కి రుణమాఫీ పూర్తి చేస్తాం అంటున్నాడు. ఏడాది కాలం గడిపారు. ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు. కేసీఆర్ ఇచ్చినవే ఇచ్చి డబ్బా కొట్టుకున్నారని విమర్శించారు. మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మాట్లాడు తూ..భిన్నత్వంలో ఏకత్వానికి తెలంగాణ రాష్ట్రం నిదర్శనం అన్నారు.