Harish Rao | హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): ఇంటి పన్ను బకాయిలున్నాయని చెప్పి వాటి కింద వృద్ధాప్య పింఛన్లు గుంజుకుంటరా? అని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తంచేశారు. కొడుకు ఇంటి పన్ను కట్టకుంటే తల్లికి వచ్చే వృద్ధాప్య పింఛన్ లాక్కుంటరా? ఇట్ల ఎక్కడైనా ఉన్నదా? అని మండిపడ్డారు. ప్రభుత్వం అత్యంత దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతూ అమానుషంగా వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్ణయాలు, అధికారుల తీరు కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయని నిప్పులు చెరిగారు. పింఛన్ డబ్బులను కూడా ఇంటి పన్ను కింద జమ చేసుకుంటే, ఆ వృద్ధుల బతుకు బండి నడిచేది ఎట్ల? అధికారంలోకి వస్తే ప్రతి నెలా రూ.4 వేలు పింఛన్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు వచ్చే రూ. 2 వేల పింఛన్‌ను గుంజుకోవడం ఏమిటి అని నిలదీశారు. ఓవైపు లబ్ధిదారుల్లో కోత విధిస్తూ, మరోవైపు చేతికందిన పింఛన్‌ను ఇంటి పన్ను బకాయికి జమ చేయడం శోచనీయమని, మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నంనూరు పంచాయతీ పరిధిలో 15 మంది వృద్ధులకు వెంటనే పింఛన్లు చెల్లించాలని, ఇంటిపన్ను ఇతర కారణాలు చెప్పి పింఛన్లు ఆపకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పింఛన్ సొమ్మును రెండింతలు పెంచుతరని ఆసరా పింఛన్ లబ్ధిదారులు ఓటేస్తే అసలే పెంచకపోగా, వచ్చే పింఛన్ సొమ్మును ఇంటి పన్ను కింద జమ చేసుకుంటూ పంచాయతీ అధికారులు దౌర్జన్యానికి దిగుతున్నారు. కొడుకుల ఇంటి పన్ను కింద వృద్ధుల పింఛన్ సొమ్మును పంచాయతీకి డైవర్ట్ చేసుకుంటున్నారు. ఇలా సుమారు 15 మంది వృద్ధుల పింఛన్ సొమ్మును ఇంటి పన్ను కింద జమ చేసుకోవడంపై వృద్ధులైన లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలం నంనూర్ గ్రామ పంచాయతీ అధికారులు వింతైన నిబంధనల పేరిట ఆసరా లబ్ధిదారులను, ఇతర గ్రామస్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ‘ఇంటిపన్ను బకాయిలు చెల్లిస్తేనే రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులు తీసుకుంటాం. ఇంటి పన్ను పెండింగ్ ఉందా? ముందు క్లియర్ చేసి రండి. నీ కొడుకు ఇంటి పన్ను కట్టలేదు. అందుకే నీకు రావాల్సిన పింఛన్ ఇంటిపన్ను కింద జమ చేసుకున్నాం. ఇదిగో రసీదు తీసుకొని పో’ అంటూ ఆసరా పింఛన్ లబ్ధిదారుల చేతిలో పెడుతూ ఉత్త చేతులతో పంపుతున్నారు. పథకాలకు పన్నులకు ముడిపెట్టడం ఏమిటని.. పన్ను చెల్లించకపోతే తమకు రావాల్సిన పింఛన్ సొమ్మును జమ చేసుకునే అధికారం అధికారులకు ఎక్కడిది? అని వృద్ధులు ప్రశ్నిస్తున్నారు.
నంనూర్ గ్రామ పంచాయతీ పింఛన్ విషయంపై జిల్లా అధికారులు స్పందించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు డీఆర్డీవో కిషన్ గురువారం నంనూర్ గ్రామానికి వచ్చి ఆరా తీశారు. ఇంటిపన్ను కట్టనందుకు పింఛన్ జమ చేసుకున్నట్టు తెలుసుకొని స్థానిక అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పన్ను కట్టలేదని పింఛన్ సొమ్ము జమ చేసుకోవడం నిబంధనలకు విరుద్ధమని అనంతరం మీడియాతో డీఆర్డీవో చెప్పారు. కొందరు పన్ను కింద పింఛన్ జమ చేసుకోవాలని స్వచ్ఛందంగా చెప్పారని తెలిపారు. గ్రామంలో తొమ్మిది మందికి ఇలా పింఛన్ ఆపినట్టు తెలిసిందని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని డీఆర్డీవో కిషన్ హామీ ఇచ్చారు.