మేడ్చల్, ఆగస్టు 25(నమస్తే తెలంగాణ)/కుత్బుల్లాపూర్ : నిషేధిత జాబితాపై కాంగ్రెస్ సర్కార్‌ను నిలదీస్తామని, బాధితుల సమస్యలు పరిష్కారమయ్యే దాకా కొట్లాడుతామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు స్పష్టంచేశారు. ప్రజల ఆస్తులను జాబితా నుంచి తొలగించేలా సెప్టెంబర్ 7న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే, సభను స్తంభింపచేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా షాపూర్‌నగర్‌లో 22ఏ నిషేధిత జాబితా బాధిత కుటుంబాలతో హరీశ్‌రావు సమావేశమై.. వారి సమస్యలు విన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వమే కంచె చేను మేసినట్టు భూములను లాక్కొని ఆగం చేస్తున్నదని మండిపడ్డారు. 22ఏ కుట్రలో ఏ1 ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఏ2 మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అని.. 50-50 కమీషన్ల కోసమే ఈ దోపిడీ అంతా జరుగుతున్నదని ఆరోపించారు. ఈ సమస్య హైదరాబాద్‌కే పరిమితం కాలేదని, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు కోటి ఎకరాల వ్యవసాయ భూములను కూడా 22ఏలో పెట్టారని విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారం వెనుక వంద శాతం రేవంత్‌రెడ్డి పాత్ర ఉన్నదని, అందుకే ఆయన సైలెంట్‌గా ఉన్నారని విమర్శించారు. ప్రజల భూములతో చెలగాటమాడుతున్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటిని శ్రీనివాస్‌రెడ్డిని తక్షణమే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
నిషేధిత జాబితాపై తక్షణమే సిట్టింగ్ జడ్డితో విచారణ జరిపించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. తద్వారా ఈ భూములను జాబితాలో ఎవరు చేర్చారో తేలిపోతుందని పేర్కొన్నారు. జాబితాను సీక్రెట్‌గా ఉంచడమే గాక, వెబ్సైట్లో లిస్ట్‌ను బ్లాక్ చేశారని, ప్రభుత్వం వెంటనే ఈ వ్యవహారంపై శ్వేతప్రతం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం తమ్ముడికేమో కోట్ల విలువైన భూములు, ప్రజల ఆస్తులేమో నిషేధిత జాబితాలో పెడుతారా అంటూ హరీశ్‌రావు నిప్పులుచెరిగారు. 98శాతం భూములను 22ఏ జాబితా నుంచి తొలగించామని మంత్రి పొంగులేటి పచ్చి అబద్ధాలు చెప్తున్నారని, అదే నిజమైతే వందలాది మంది బాధితులు గోడు చెప్పుకొనేందుకు ఇక్కడికి ఎందుకు వస్తారని ప్రశ్నించారు. తనకు రియల్ ఎస్టేట్ బాగా తెలుసని రేవంత్‌రెడ్డి గొప్పలు చెప్పుకొంటాడని, మరి వ్యాపారం తెలిస్తే ప్రజల కష్టాలు తీర్చాలి కానీ వాళ్ల రక్తం పీల్చి పిప్పిచేస్తారా అని నిలదీశారు.
యాదాద్రి జిల్లాలో 40వేల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్నాయని నాలుగు నెలల క్రితమే మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముఖ్యమంత్రికి చెప్పినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. 58 ఏండ్ల క్రితం ఏర్పడిన పద్మారావునగర్, నిజాంపేట్ లాంటి కాలనీలను నిషేధిత జాబితాలో చేర్చడాన్ని సర్కార్ తగ్లక్ చర్యగా అభివర్ణించారు. అమీన్పూర్ నుంచి వచ్చిన ఒక బాధితుడు స్వయంగా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్లను కలిసినా సమస్య తీరకపోవడంతో బయట బ్రోకర్లతో పని అవుతుందని పరోక్షంగా అధికారులే చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం భీమవరం, యాదాద్రి జిల్లా రాజాపేట మండలం చల్లూర్‌లో ఏకంగా సగం ఊరినే నిషేధిత జాబితాలో పెట్టారని, అమీన్పూర్ పోలీస్‌స్టేషన్, చివరికి ముఖ్యమంత్రి ఇల్లు కూడా బ్లాక్‌లిస్ట్‌లో ఉన్నాయంటే ఈ ప్రభుత్వ పనితీరు ఎంత ఆధ్వానంగా ఉన్నదో అర్థమవుతున్నదని ధ్వజమెత్తారు. మల్కాజిగిరిలో 22 ఏ భూములపై మాట్లాడినప్పుడు అక్కడికొచ్చిన వారి పేర్లు రాసుకొని వారి భూములను జాబితా నుంచి తొలగించినట్టు హరీశ్‌రావు తెలిపారు. బీఆర్ఎస్ పోరాటం వల్లే ప్రభుత్వంలో ఈ మాత్రం కదలిక వచ్చిందని చెప్పారు.
22ఏ బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, ఆందోళన చెందవద్దని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద పేర్కొన్నారు. ప్రభుత్వం కావాలనే ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చిందని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ భూములతోపాటు ప్రజల ఆస్తులను కబ్జాలు చేసేందుకు ప్రయత్నిస్తుందని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మండిపడ్డారు. ప్రజలకు న్యాయం చేయాల్సింది పోయి కొల్లగొట్టేలా చూస్తున్నదని ఆరోపించారు. మల్కాజిగిరిలో బాధితులతో హరీశ్‌రావు సమావేశం నిర్వహించిన వెంటనే నియోజకవర్గంలో జాబితా నుంచి ప్రైవేట్ ఆస్తులను తొలగిస్తున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల ఆస్తులను తొలగించే వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని ఆయన హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.