Harish Rao | సిద్దిపేట, జూన్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం తక్షణమే 25 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో విద్యార్థులకు బుక్స్, యూనిఫారాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 25 వేలకుపైగా పాఠశాలలు పునః ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ సర్కారు డీఎస్సీలో 25 వేల ఖాళీలు నింపుతామని చెప్పి కేవలం 11 వేల ఖాళీలకే నోటిఫికేషన్ ఇచ్చిందని మండిపడ్డారు.
ఇచ్చిన మాట ప్రకారం వెంటనే 25 వేల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయాలి డిమాండ్ చేశారు. సూళ్లు ప్రారంభమైన నేపథ్యంలో వర్షాకాలంలో వచ్చే సమస్యలను దృష్టిలో ఉంచుకొని పాఠశాలలో మరమ్మతులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సూచించారు. ‘మనఊరు- మనబడి’ కార్యక్రమాన్ని ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ కొనసాగించి, ప్రభుత్వ పాఠశాలలను మరింత అభివృద్ధి చేయాలని అన్నారు. అన్ని ప్రభుత్వ సూళ్లలో పారిశుద్ధ్య సిబ్బందిని నియమించాలని, బడులకు ఉచిత కరెంటు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని సూచించారు. కార్పొరేట్ పాఠశాలలకు తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాలలో మంచి విద్య అందుతున్నదని చెప్పారు.
తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించే బాధ్యత తీసుకోవాలని కోరారు. తల్లిదండ్రుల ఆలోచనకు అనుగుణంగా బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నమెంట్ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టి విద్యార్థులకు మెరుగైన విద్య అందించిందని గుర్తుచేశారు. అనంతరం సిద్దిపేట జిల్లా కేంద్ర దవాఖానను హరీశ్‌రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి అందుతున్న వైద్యసేవలపై ఆరాతీశారు. అన్ని విభాగాలను పరిశీలించారు. వైద్యసిబ్బందితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. సరిపడా మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. పరీక్షలు, మందుల కోసం బయటకు పంపవద్దని వైద్యులను కోరారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు.