రామన్నపేట, డిసెంబర్ 10 : ఆర్థిక ఇబ్బందులతో చేనేత కార్మికురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురంలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిపురంనకు చెందిన దోర్నాల విజయలక్ష్మి (50) చేనేత వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నది. ఆమె భర్త ప్రభాకర్ 2004లో మృతి చెందాడు.
ఆమెకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక మంగళవారం చేనేత వస్ర్తాలకు అద్దె రంగుల రసాయనం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. స్పృహతప్పిన విజయలక్ష్మిని కోడలు స్వప్న గమనించి కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో వారు విజయలక్ష్మిని నార్కట్పల్లి కామినేని దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలి కుమారుడు సాయికుమార్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్ఐ మల్లయ్య తెలిపారు.