హైదరాబాద్ : చేనేత ఉత్పత్తులను జీరో జీఎస్టీలోకి తీసుకురావాలని ఫెడరేషన్ ఆఫ్ హ్యాండ్లూమ్ ఛాంబర్స్, అఖిల భారత పద్మశాలీ సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. చేనేతపై జీఎస్టీ ప్రభావంపై వివరించారు. మిల్లు వస్త్రాల నుంచి చేనేత రంగం తట్టుకోవాలంటే సున్నా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్నారు. చేనేత, మగ్గం, పవర్‌లూంలపై తయారైన కొన్ని చీరెలను మంత్రికి తెలంగాణ చేనేత బృందం చూపింది.
చేనేతకు, మిల్లు వస్త్రాలకు ఒకే విధమైన పన్ను సరికాదని కేంద్రమంత్రికి ప్రతినిధుల బృందం వివరించింది. దేశవ్యాప్తంగా ఉన్న 32 లక్షల చేనేత కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని చేనేతపై జీఎస్టీ పన్ను తొలగించాలని కేంద్రమంత్రిని కోరారు. చేనేత వస్త్రాలకు ఉపయోగించే ముడిపదార్థాలు, తయారైన వస్త్రాలపై సున్నా జీఎస్టీపై నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారని ప్రతినిధులు పేర్కొన్నారు. చేనేత వస్త్రాలపై సున్నా జీఎస్టీ అంశాన్ని జౌళీశాఖ మంత్రి పీయూష్ గోయల్ దృష్టికి తీసుకువెళ్లాలని నిర్మలా సీతారామన్ సూచించారని ఫెడరేషన్ ఆఫ్ హ్యాండ్లూమ్ చాంబర్స్ అధ్యక్షుడు గజం అంజయ్య పేర్కొన్నారు.