హైదరాబాద్, ఆగస్టు 21(నమస్తే తెలంగాణ): ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల ఆర్‌అండ్‌బీశాఖ పరిధిలోని రోడ్ల నష్టంపై నివేదిక రూపొందించాలని రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అధికారులను ఆదేశించారు. శిథిలావస్థకు చేరిన కల్వర్టులు, వంతెనల స్థానంలో కొత్తవి నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన కోరారు. వర్షాల వల్ల రోడ్లకు జరిగిన నష్టంపై గురువారం సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అతికొద్ది రోజుల్లోనే హ్యామ్ విధానం ద్వారా మెరుగైన, నాణ్యమైన రోడ్లు నిర్మించనున్నట్టు తెలిపారు. దీనికి త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి.. వర్షాలు తగ్గుముఖం పట్టగానే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. వర్షాల వల్ల రోడ్లకు దాదాపు రూ. 1000 కోట్ల వరకు నష్టం జరిగినట్టు అధికారులు మంత్రికి వివరించారు. ఈ సమావేశంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ప్రభుత్వ స్పెషల్ సీఎస్ వికాస్‌రాజ్, ఈఎన్సీ జయభారతి, సీఈ రాజేశ్వర్ రెడ్డి, ఎస్ఈ ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.