హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : అపార్ (ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రేషన్) నమోదులో గురుకుల సొసైటీలు వెనకబడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ 40% మంది విద్యార్థుల వివరాలను నమోదు చేయలేదని తెలుస్తున్నది. దీనిపై కేంద్ర విద్యాశాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు 15వ తేదీలోగా పూర్తి చేయాలని అల్టిమేటం జారీ చేసినట్టు తెలుస్తున్నది. ఇదిలా ఉంటే ఇష్టారీతిన అడ్మిషన్లను ఇవ్వడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని గురుకుల అధికారులు వెల్లడిస్తున్నారు. నూతన విద్యావిధానం(2020)లో భాగంగా కేంద్ర విద్యాశాఖ అపార్ను అమలు చేస్తున్నది. విద్యార్థులకు సంబంధించి అకాడమిక్ రికార్డును డిజిటల్‌గా నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా ప్రతీ విద్యార్థి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంది. సదరు విద్యార్థికి 12అంకెల అపార్ ఐడీ నంబర్‌ను కేటాయిస్తారు.
దీనిద్వారా ఒక విద్యార్థి ఎంతవరకు చదివారు? ఎక్కడ చదివారు? తదితర వివరాలన్ని ఆన్లైన్లో తెలుసుకునే అవకాశముంది. అయితే ఈ అపార్ నమోదులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు చాలా వెనకబడి ఉన్నాయని తెలుస్తున్నది. అపార్ నమోదును పూర్తి చేయాలని మూడు నెలల క్రితమే ఆదేశాలు జారీ చేయగా, ఇప్పటికీ గురుకులాల్లో ఈ ప్రక్రియ పూర్తి కాలేదని తెలుస్తున్నది. గురుకులాల్లో ప్రవేశాలకు 5వ తరగతి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 13ఏండ్లలోపు, ఓబీసీ, మైనార్టీ ఇతర వర్గాలకు చెందిన విద్యార్థుల వయస్సు 11ఏండ్లలోపు ఉండాలి. అదేవిధంగా 6వ తరగతిలో ప్రవేశానికి 14, 12ఏండ్లలోపు, 7వతరగతిలో ప్రవేశానికి 15,13ఏండ్లలోపు, 8వ తరగతిలో ప్రవేశానికి 16,14ఏండ్లలోపు, 9వ తరగతిలో ప్రవేశాలకు 17, 15 సంవత్సరాల లోపు వయస్సు ఉండాల్సిందే. అడ్మిషన్ల సమయంలో గురుకులాల సిబ్బంది ఈ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని తెలుస్తున్నది. పైరవీలతో ఇష్టారీతిన సీట్లు కేటాయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.