Group-2 Exam | హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రస్థాయిలో కీలకమైన గ్రూప్-2 పరీక్ష షెడ్యూల్ ప్రకారమే జరగనున్నది. ఆదివారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటనతో స్పష్టత వచ్చింది. గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని ఇటీవల కొంతమంది టీఎస్పీఎస్సీని ఆశ్రయించారు. షెడ్యూల్ ప్రకారమే పరీక్ష నిర్వహించాలని మరికొందరు కమిషన్‌ను కోరారు. టీఎస్పీఎస్సీ కొన్ని నెలల క్రితమే పరీక్ష తేదీని ప్రకటించింది. ఈ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసింది. పరీక్ష నిర్వహణ, కేంద్రాలు తదితర అంశాలపై టీఎస్పీఎస్సీ ఇప్పటి నుంచే కసరత్తు చేసింది. కలెక్టర్లు, పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించింది.
గ్రూప్-2 నిర్వహించనున్న కేంద్రాలకు పరీక్ష తేదీలైన ఆగస్టు 29, 30 తేదీల్లో విద్యాశాఖ సెలవు ప్రకటించింది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో కొందరు సభ్యులు సైతం గ్రూప్-2 వాయిదా వేయాలని కోరారు. ఈ నేపథ్యంలో సీఎస్ శాంతికుమారితో సీఎం కేసీఆర్ చర్చించారు. అన్నీ పరిశీలించిన తర్వాత గ్రూప్-2 పరీక్ష యథావిధిగా కొనసాగుతుందని సీఎం ప్రకటించారు. పరీక్షకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, మిగిలిన పరీక్షల నిర్వహణపై మరోసారి అధికారులతో చర్చించాలని సీఎస్‌ను సీఎం ఆదేశించారు.
రాష్ట్రస్థాయిలో గ్రూప్-1 తర్వాత అత్యంత కీలకమైనది గ్రూప్-2 ఉద్యోగమే. రాష్ట్రంలో గ్రూప్-2 కేటగిరీ కింద 18 విభాగాల్లో 783 ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబర్ 29న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీచేసింది. గ్రూప్-2కు అభ్యర్థుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. మొత్తం 5,51,943 మంది దరఖాస్తు చేశారు. అంటే.. సగటున ఒక్కో ఉద్యోగానికి 705 మంది పోటీ పడుతున్నారు.