హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 పరీక్షలపై న్యాయపోరాటం చేస్తున్న అభ్యర్థులు శుక్రవారం దేశ సర్వోన్నత న్యాయస్థానం తలుపుతట్టారు. హైకోర్టులో పోరాడిన అభ్యర్థులు ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లారు. పరీక్షలను వాయిదా వేయాలని, జీవో-29ని రద్దు చేయాలని కోరుతూ పోగుల రాంబాబు, ఇతర అభ్యర్థులు పిటిషన్ దాఖలుచేశారు. గ్రూప్-1 పరీక్షల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను పాటించలేదని, ఈ నెల 21 నుంచి జరగాల్సిన గ్రూప్-1 పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థుల తరఫు అడ్వకేట్ మోహిత్‌రావు ఆ పిటిషన్లో కోరారు. తమ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ జరపాలని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు మోహిత్‌రావు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ కేసును తక్షణమే విచారించలేమని, సోమవారం విచారణ చేపడతామని చీఫ్ జస్టిస్ వెల్లడించారు. అనంతరం గ్రూప్-1 అభ్యర్థులు ఇకడి తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టి.. ఉత్తర్వులు జారీ చేసే వరకు గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.
అప్పీళ్లను కొట్టివేసిన హైకోర్టు ధర్మాసనం
గ్రూప్-1 పరీక్షల నోటిఫికేషన్ జారీని, మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలన్న అభ్యర్థనను హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తిరసరించింది. ఈ అంశంపై ఈ నెల 15న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుల్లో జోక్యం చేసుకోవడానికి ఆసారం లేదని చెప్పింది. ప్రిలిమినరీ పరీక్ష కీలో తప్పుల్నుందున పరీక్షను రద్దు చేసి తాజాగా నిర్వహించేలా ఆదేశించాలన్న అప్పీళ్లను కొట్టివేస్తున్నట్టు తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. మెయిన్స్ పరీక్షల నిర్వహణలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.
జీవో-29 సారాంశం ఇదే..
టీజీపీఎస్సీ గ్రూప్-1 నియామకాల్లో భాగంగా ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపికకోసం కులాలతో సంబంధం లేకుండా మెరిట్ ప్రకారం 1:50 నిష్పత్తిలో ఎంపికచేస్తారు. మల్టీజోన్ వారీగా మొత్తం ఖాళీల నుంచి 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఇది పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుంది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత రిజర్వ్ క్యాటగిరీలో షార్ట్‌ఫాల్ (లోటు) ఏర్పడితే, రూల్స్ 22, 22ఏలో నిర్దేశించిన ప్రకారం ఆయా లోటును పూడ్చేందుకు సంబంధిత వర్గాల మెరిట్ జాబితా నుంచి మరికొంత మంది అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఇలా ఒక్కోసారి 1:50 రేషియో దాటినా అనుమతిస్తారు. ఇది వరకు జీవో-55 ప్రకారం జనరల్ మెరిట్‌తో సంబంధం లేకుండా కులాల వారీగా ఎన్ని పోస్టులు రిజర్వ్ అయ్యాయో అంతేస్థాయిలో 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసేవారు.