హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): గ్రూప్1 దరఖాస్తు గడువు ఈ నెల 31న ముగుస్తుంది. కానీ, ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదు. నేటికీ కొందరు బోనఫైడ్ సర్టిఫికెట్ల కోసం తిరుగుతున్నారు. గ్రూప్-1 దరఖాస్తుకు బోనఫైడ్ అవసరం లేదని టీఎస్పీఎస్సీ తెలిపింది. విద్యార్హతల సర్టిఫికెట్లు అప్లోడ్ చేయడం తప్పనిసరి కాదని పేర్కొన్నది. స్థానికులకు 95 శాతం రిజర్వేషన్లు కల్పించనున్న నేపథ్యంలో 1 నుంచి 7వ తరగతి వరకు ఎక్కడ చదివారన్నది ముఖ్యమని తెలిపింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో దరఖాస్తులో తెలిపిన వివరాలు వేరు గా ఉంటే చట్టపర చర్యలు తప్పవని హెచ్చరించింది. బోనఫైడ్ సర్టిఫికెట్‌కు బదులుగా లోకల్ ఏరియా లేదా ఇతర సర్టిఫికెట్లు చూపిస్తే సరిపోతదని కొందరు భావిస్తున్నారని, అది అపోహేనని టీఎస్పీఎస్సీ స్పష్టంచేసింది. సందేహాలకు 040-22445566ను సంప్రదించాలని తెలిపింది. దరఖాస్తు సమయంలో ఏమైనా సమస్యలు తలెత్తితే helpdesk@tspsc.gov.in ద్వారా చేసుకోవచ్చని వివరించింది.