పరిగి, జనవరి 25: ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు మద్దతు ధర దక్కకపోవడంపై అన్నదాతలు భగ్గుమన్నారు. మార్కెట్లో వ్యాపారులు సిండికేట్‌గా మారి, అధికారులతో కుమ్మక్కై ఒక్క వారంలోనే క్వింటాలుకు రూ.2 వేలు వరకు ధర తగ్గించడంపై పరిగి వేరుశనగ రైతులు మండిపడ్డారు. అధికారుల తీరుకు నిరసనగా హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై నిరసనకు దిగడంతో రెండు గంటలపాటు ట్రాఫిక్‌జామ్ అయింది. పరిగి మార్కెట్‌యార్డుకు పరిగి, బొంరాస్‌పేట్ మండలాల రైతు లు శనివారం పెద్ద మొత్తంలో వేరుశనగ తీసుకువచ్చారు. వ్యాపారులు కుమ్మక్కై గత వారంతో పోలిస్తే క్వింటాలుకు రూ.2 వేలు తక్కువ ధర కోట్ చేశారు.
గత శుక్రవారం క్వింటాలుకు రూ.6,500 వరకు చెల్లించగా.. శనివారం రూ.4500 మాత్రమే ధర కోట్ చేయడంతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. జాతీయ రహదారిపై నిరసనలకు దిగడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అనంతరం మార్కెట్‌యార్డుకు వెళ్లి దుకాణాలు మూసివేయించి, మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఒక్క వారంలోనే ధరలు ఎందుకు తగ్గాయం టూ అన్నదాతలు మండిపడ్డారు. కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యాపారులు తక్కువ ధర కోట్ చేస్తున్నారని, తక్‌పట్టీలు ఇవ్వడం లేదని ఆరోపించారు. రైతులతో మా ట్లాడిన ఎస్ఐ సంతోష్‌కుమార్ వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అధిక ధర చెల్లించేలా చూస్తామని, లేకపోతే సోమవారం ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసేలా చూస్తామని ఎస్ఐ, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి రైతులకు హామీ ఇచ్చారు.