హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): రాజ్యసభసభ్యుడు సంతోష్‌కుమార్ పిలుపుమేరకు జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ బొంతు శ్రీదేవియాదవ్ ఆదివారం గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొన్నారు. చక్రిపురం వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో జమ్మి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం సీఎం కేసీఆర్ హరితహారంతో రాష్ట్రమంతటా మొకలు నాటే మహోన్నత కార్యక్రమం చేపడుతున్నారని పేర్కొన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌తో ఎంపీ సంతోష్‌కుమార్ దేశంలోని ప్రముఖులతో మొకలు నాటిస్తున్నారని, ఇది చాలా గొప్ప కార్యక్రమమని చెప్పారు. మరోవైపు, విలక్షణ పాత్రల సినీనటుడు కబీర్ దుహాన్‌సింగ్ గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా దూలపల్లిలోని ఫారెస్ట్ అకాడమీలో మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్‌కుమార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బూర్గుపల్లిలోని సత్యసాయి సేవా సమితి ప్రాంగణంలో ఎంబీసీ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్‌తో కలిసి ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి జమ్మి మొక్క నాటారు.